సొంతూరిని ఢీకొట్టిన కిమ్ క్షిప‌ణి..చ‌ర్చ‌ల‌కు రెడీ

Update: 2018-01-06 05:47 GMT
ప్ర‌పంచానికి ముఖ్యంగా అమెరికాకు కొర‌క‌రానికి కొయ్య‌గా మారిన ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న మొండిప‌ట్టును వీడారు. చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఉత్తరకొరియా క్షిపణి సొంత పట్టణాన్ని ఢీకొట్టిన స‌మ‌యంలో కిమ్ ఈ చ‌ర్చ‌ల‌కు ముందుకు రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కిమ్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డంతో...వచ్చేవారం ఉత్తర, దక్షిణకొరియా దేశాల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు దక్షిణకొరియా ప్రతిపాదనను ఉత్తరకొరియా శుక్రవారం అంగీకరించింది.

గత ఏడాది ఉత్తరకొరియా పలు ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేపట్టడంతో ప్రాంతీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. అదేసమయంలో దక్షిణకొరియాలో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడలకు తమ బృందాన్ని పంపుతామని ఉత్తరకొరియా ప్రకటించడంతో ఉభయ దేశాల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వచ్చేవారం చర్చలకు రావాలని దక్షిణకొరియా ఉత్తరకొరియాను ఆహ్వానించింది. శీతాకాల ఒలింపిక్స్ క్రీడలు ముగిసే వరకు సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేయాలని అమెరికా, దక్షిణకొరియా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే ఉత్తరకొరియా సానుకూలంగా స్పందించింది. 2015 డిసెంబర్ తర్వాత ఉభయ కొరియాల మధ్య తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఇరుదేశాల సరిహద్దుల్లోని సైనిక రహిత గ్రామమైన పాన్‌మూన్‌జొమ్‌లో చర్చలు జరుగనున్నాయి.

కాగా, ఉత్తరకొరియా గతేడాది ప్రయోగించిన ఓ మధ్య శ్రేణి క్షిపణి అదే దేశంలోని ఓ పట్టణంపై పడినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి (ఐఆర్‌ బీఎం) హ్వాసంగ్-12ను ఉత్తరకొరియా ప్రయోగించింది. ప్రయోగం విఫలమై ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ కు 90 మైళ్ల దూరంలో ఉన్న టోక్చోన్ పట్టణంలో ఆ క్షిపణి పడినట్టు అమెరికా అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా..కొరియా ద్వీపకల్పంలో సైనిక విన్యాసాలను పాక్షికంగా నిలిపివేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ గేమ్స్‌కు దక్షిణ కొరియా వేదికగా మారనుంది. వచ్చేనెలలో జరుగనున్న ఒలింపిక్‌ గేమ్స్‌ కోసం దక్షిణ కొరియా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ క్రీడల్లో ఉత్తరకొరియా క్రీడాకారులు కూడా పాల్గొంటారని ఆదేశాధ్యక్షుడు కిమ్‌-జోంగ్‌-ఉన్‌ ప్రకటించారు. అయితే, కొరియా ద్వీపకల్పంలో అమెరికా - దక్షిణ కొరియా - జపాన్‌ బలగాలు గత కొతకాలంగా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్‌ గేమ్స్‌ పూర్తయేంత వరకు కొరియా ద్వీపకల్పంలో ఎలాంటి విన్యాసాలు నిర్వహించొద్దని అమెరికా రక్షణ శాఖకు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్‌ ప్రతిపాదనను దక్షిణ కొరియా, జపాన్‌ కూడా స్వాగతించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, జాయింట్‌ మిలిటరీ డ్రిల్స్‌ వాయిదా వేయ డమంటే ఉత్తరకొరియాకు తలొగ్గినట్టు కాదని, అంతర్జాతయ సమాజం నుంచి ఆ దేశంపై ఒత్తిళ్లు పెంచుతామని అన్నారు. ప్రస్తుతం జపాన్‌ చుట్టూ నెలకొన్న పరిస్థితులు రెండో ప్రపంచ యుద్ధం కాలం కంటే ప్రమా దకరంగా ఉన్నాయని జపాన్‌ ప్రధాని షింజో అబే అభిప్రాయ పడ్డారు.
Tags:    

Similar News