ఆ దేశాధ్యక్షుడి మాటతో ప్రపంచం ఉలిక్కిపడింది

Update: 2016-03-09 07:11 GMT
మొండోడు రాజు కంటే బలవంతుడంటారు. అలాంటిది మొండోడే రాజు అయితే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు.. ఆ మొండి రాజుకు వేపకాయంత వెర్రి ఉండి.. మామిడికాయంత మూర్ఖత్వం ఉంటే ఎంత ఇబ్బందో ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తున్న పరిస్థితి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నోటి వెంట వచ్చిన తాజా మాటతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి.

కొన్ని దశాబ్దాలుగా అంతో ఇంతో శాంతితో ఉన్నది కాస్తా.. తాజాగా కిమ్ దెబ్బకు వణికిపోయే పరిస్థితి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తమ దగ్గర అణుబాంబు ఉందన్న మాట చెప్పిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. తాజాగా తమకు న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయని.. వాటిని బాలిస్టిక్ మిసైళ్లకు అమర్చగలమని చెప్పి బిత్తరపోయేలా చేశారు.

ఇంతకాలం అనధికారికంగా ఉత్తరకొరియా వద్ద అణుబాంబులు ఉన్నాయన్న వాదన స్థానే.. ఏకంగా దేశాధ్యక్షుడే తమకున్న అణు ఆయుధ సంపత్తి గురించి చెప్పటం ప్రపంచ దేశాల్నిఇప్పుడు వణికించేలా చేస్తోంది. అంతేకాదు.. తనకున్న సాంకేతికతతో ఖండాంతరాల్లోని లక్ష్యాల్ని కూడా ఛేదించే సత్తా తమ సొంతమన్న మాటతో ప్రపంచ శాంతి ప్రమాదంలో పడినట్లేనని చెప్పకతప్పదు. అణ్వాయుధాల తయారీపై ఐక్యరాజ్యసమితి ఆంక్షల నేపథ్యంలో కొరియా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఉత్తర కొరియా అధ్యక్షుడి దూకుడుకు పగ్గాలు వేసే వారు ఎవరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News