కిమ్‌.. దుర్మార్గం అంతా ఇంతా కాదు!

Update: 2017-09-23 04:33 GMT
త‌న మాట‌లు, చేష్ఠ‌ల‌తో ప్ర‌పంచానికి స‌వాలుగా మారిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్‌-ఉన్ గురించి అనేక భ‌యంక‌ర నిజాలు ఇప్పుడిప్పుడే ప్ర‌పంచానికి తెలుస్తున్నాయి. అణుప‌రీక్షల విష‌యంలో సాక్షాత్తూ.. ఐక్య‌రాజ్య స‌మితిని సైతం లెక్క చేయ‌కుండా త‌న వైఖ‌రిని ప్ర‌ద‌రిస్తున్న కిమ్‌.. అగ్ర‌రాజ్యం అమెరికా కంటిపై కునుకులేకుండా చేస్తున్నాడు. పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తోనే రెండంటా! అన్న రీతిలో రెచ్చిపోతున్నాడు. త‌మ వ‌ద్ద అమెరికాను సైతం భ‌స్మం చేయ‌గ‌ల పాట‌వం ఉంద‌ని ఇటీవ‌లే వెల్ల‌డించిన ఆయ‌న పాల‌న‌పై ఇప్పుడు కొన్ని భ‌యంక‌ర వాస్త‌వాలు వెలుగు చూశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌ర కొరియా వాసులు ఎంత న‌ర‌కం అనుభ‌వించారో ఇప్పుడు ప్ర‌పంచానికి తెలిసింది. అదేస‌మ‌యంలో కిమ్ దుర్మార్గం ఏ రేంజ్‌ లో ఉంటుందో కూడా అర్ధ‌మైంది. వివ‌రాల్లోకి వెళితే..

ఉత్త‌ర కొరియా చిన్న దేశం. అయినా.. ప్ర‌తిభా పాట‌వాల్లో అగ్ర‌రాజ్యాన్ని ఢీకొనే స‌త్తా ఈ దేశం సొంతం. ప్ర‌స్తుతం ప్ర‌పంచానికి తెలిసింది ఇది ఒక్క‌టే. అయితే, నాణేనికి రెండో వైపు అన్న‌ట్టుగా ఇప్పుడు ఉత్త‌ర కొరియా ప్ర‌జ‌ల జీవ‌నం - కిమ్ నియంతృత్వ పాల‌న గురించి కొన్ని విష‌యాలు వెలుగు చూశాయి. ఆయన, ఆయన చుట్టూ ఉన్నవారు తప్ప మిగ‌తా వారంతా కూడా ఎన్ని బాధలు పడుతుంటారో, ఎంతటి దురవస్థను అనుభవిస్తుంటారో ప్రపంచానికి తెలిసింది. ఒకప్పుడు కిమ్‌ నివాసాల్లోకి సెక్స్‌ బానిసగా వెళ్లి చివరకు తప్పించుకొని బయటపడిన ఓ 26 ఏళ్ల మహిళ ఉత్తర కొరియాలో కిమ్‌ పాలనలో ఉన్న కరడు గట్టిన నిజాలను ఓ మీడియాకు తెలియజేసింది.

 హీ యోన్‌ లిమ్‌(26) అనే ఆ మహిళ వివరాలను తెలియజేస్తూ తాను టీనేజ్‌ లో ఉండగానే కిమ్‌ వద్దకు బందీగా వెళ్లినట్లు తెలిపింది. లైంగిక కార్యకలాపాలకోసం ఆమెను కిమ్‌ పరివారానికి సంబంధిచింన ఇళ్లన్నింటిలోకి తిప్పారని వాపోయింది. తనలాంటి ఎంతోమంది అమ్మాయిలను అక్కడ బంధించి తీసుకెళ్లి లైంగికంగా అనుభవిస్తుంటారని, తాము పడే చిత్ర హింసలు చూసి వారంతా ఎంజాయ్‌ చేస్తుంటారని తెలిపింది. కిమ్‌ ఆయన చుట్టు ఉన్న మనుషులంతా తమను తాము రాజులుగా భావిస్తుంటారని, వాస్తవానికి ఆయన పాలన కింద మనుషులు మాత్రం కడు బీదలుగా ఉంటారని వెల్లడించింది. సెక్స్‌ బానిసలుగా తీసుకెళ్లిన అమ్మాయిల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా, ఒక వేళ వారికి గర్భం వచ్చినా వారిని దుర్మార్గంగా చంపేస్తార‌ని తెలిపింది.

కిమ్‌ ఎంతటి క్రూరంగా హత్యలు చేయిస్తాడో తాను స్వయంగా చూశానని, ఓసారి ఓ పదకొండు మంది సంగీతకారులను అతి దారుణంగా చంపించారని గుర్తు చేసుకుంది. పోర్నోగ్రఫీకి పాల్పడ్డారనే ఆరోపణల కింద వారిని జనాల మ‌ధ్య నుంచి పొలాల్లోకి ఈడ్చుకొచ్చి ఎయిర్‌ క్రాఫ్ట్‌ గన్‌ ల ద్వారా తుక్కుతుక్కుగా కాల్చిపడేశారని, ముక్కలు ముక్కలు చేశారని చెప్పింది. అంతేకాదు, గ‌తంలో త‌న ప‌ద‌వికి ఎస‌రు పెడ‌తాడేమోన‌ని భావించి సొంత మేన‌మామ‌ను.. అది కూడా ప్ర‌భుత్వంలో కీల‌క శాఖ‌కు మంత్రిగా ఉన్న వ్య‌క్తిని కిమ్ దారుణాతి దారుణంగా బ‌ట్ట‌లు ఊడ‌దీసి.. కుక్క‌ల‌కు ఆహారంగా వేశాడు. ఆ త‌ర్వాత మేన‌మామ కుమారుడు - మ‌నుమ‌ల‌ను సైతం ఇదే విధంగా వెతికి వెతికి చంపించాడు. ఇక‌, ఉత్త‌ర కొరియాలో ఎవ‌రూ ప‌రాయి దేశ‌స్తుల‌తో మాట్లాడ‌డం - వారికి దేశ వివ‌రాలు ఇవ్వ‌డం వంటి చేయ‌రాదు. అలా చేస్తే.. వారికి బ‌హిరంగ శిర‌చ్ఛేద‌మే శిక్ష‌గా నేటికీ అమ‌ల‌వుతోంది... అంటూ పేర్కొంది. ఇలాంటి క్రూరుడు... యుద్ధం మొద‌లుపెడితే ప్ర‌పంచ భ‌విష్య‌త్తు ఏంట‌నేది త‌ల‌చుకోవ‌డానికే భ‌యంగా ఉంటుంది.
Tags:    

Similar News