వేశ్య‌ల‌కు అక్క‌డ ఉరేస్తార‌ట‌!

Update: 2017-07-19 11:55 GMT
ఉత్త‌ర‌కొరియా పేరు ఇప్పుడు ప్ర‌పంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎందుకంటే... అగ్ర‌రాజ్యం అమెరికా హెచ్చ‌రిక‌ల‌ను కూడా బేఖాత‌రు చేస్తూ ఆ దేశం ఇప్పుడు అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌కు దిగింది. ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... తాను అనుకున్న‌దే త‌డ‌వుగా ఉత్త‌ర కొరియా అణు ప‌రీక్ష‌లు చేస్తూనే ఉంది. అణ్వ‌స్త్రాల‌ను ప్ర‌యోగిస్తూ... ప్ర‌పంచ దేశాల‌ను తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. మొన్న‌టిదాకా ఆ దేశం ఇదే వైఖ‌రిని అవ‌లంభించినా... ఇంత స్పీడు క‌నిపించ‌లేదు. అయితే ఇటీవ‌లే ఆ దేశ పాల‌కుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కిమ్ జోంగ్ ఉన్‌... ఈ త‌ర‌హా చ‌ర్య‌ల్లో వేగాన్ని పెంచేశారు. అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌ల‌తోనే ఆ దేశం ఇప్ప‌టిదాకా వార్త‌ల్లో ఉంటే... అక్క‌డ‌ అమ‌ల‌వుతున్న క‌ఠిన చ‌ట్టాలకు సంబంధించి ఆ దేశం మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

చిన్న చిన్న నేరాల‌కు కూడా అక్క‌డ ఉరిశిక్ష‌లే అమ‌లు చేస్తార‌ట‌. అది కూడా ఎక్క‌డో జైళ్ల‌ల్లో గుట్టుగా మ‌ర‌ణ శిక్ష‌లు అమ‌లు చేయ‌ర‌ట‌. బ‌హిరంగంగా... ప్ర‌జ‌లంద‌రూ చూస్తుండ‌గానే నేర‌స్తుల‌ను ఉరి తీసే ఆ దేశ పాల‌కులు ఆ దేశ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ దేశానికి పొరుగు దేశంగానే కాకుండా... ఆ దేశ దుందుడుకు వైఖ‌రితో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద‌క్షిణ కొరియాకు చెందిన ఓ సంస్థ విడుద‌ల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నివేదిక ఇప్పుడు ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. ఆ నివేదిక ప్ర‌కారం...  వ్యభిచారులను - పరిశ్రమల నుంచి వస్తువులు దొంగిలించినవారిని, దక్షిణ కొరియాకు దేశ సమాచారాన్ని చేరవేసిన వారికి అక్క‌డ ఉరి శిక్షే అమ‌లు చేస్తార‌ట‌. అది కూడా చాటుగా కాకుండా ప్ర‌జ‌లంతా చూసేలా బ‌హిరంగంగానే ఉరి తీస్తార‌ట‌.

ఇక ఈ ఉరి శిక్ష‌లు అమ‌లు చేసే ప్ర‌దేశాలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే... నది పరివాహక ప్రాంతాలు, పాఠశాలల క్రీడా ప్రాంగణాలు - మార్కెట్లు త‌దిత‌ర జ‌న సంచారం బాగా ఉండే ప్ర‌దేశాల‌నే ఉరిశిక్ష‌లు అమ‌లు చేయ‌డానికి ఎంపిక చేస్తార‌ట‌. ఈ త‌ర‌హా శిక్ష‌ల‌ను చూసి జ‌డిసిపోయి ఉత్త‌ర‌కొరియా నుంచి ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న 375 మంది ఈ విషయాన్ని చెప్పారట‌. ఈ నివేద‌క‌ను విడుద‌ల చేసిన సంస్థ‌... ఉత్తరకొరియా మ్యాప్‌ లో బహిరంగ ఉరి తీసే ప్రదేశాలను గుర్తించి ప్రచురించింది కూడా. 2014లో నియంతగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హక్కుల ఉల్లంఘన మరింత పెరిగిందని యూనైటెడ్‌ నేషన్స్‌ కమిషన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. భారీ జైళ్లు, క్రమపద్దతిలో హింస, ఆకలితో మాడ్చి చంపడం, ఉరి తీయడం లాంటి శిక్షలు నాజీ కాలం కన్నా ఘోరంగా ఉత్తరకొరియాలో అమలు జరుగుతున్నాయని సంస్ధ తెలిపింది.
Tags:    

Similar News