కొరియా తెగింపు..జ‌పాన్‌ - అమెరికాలో వ‌ణుకు

Update: 2017-09-15 16:58 GMT
ఉత్త‌రకొరియా త‌న దూకుడును మ‌రింత ప్ర‌ద‌ర్శించింది. జ‌పాన్‌ ను స‌ముద్రంలో క‌లిపేస్తాం.. అమెరికాను బూడిద చేస్తాం అని హెచ్చ‌రించిన  మ‌రుస‌టి రోజే ఉత్త‌ర కొరియా తెగించింది. జ‌పాన్ మీదుగా మ‌రో మిస్సైల్‌ ను ప్రయోగించింది. నెల రోజుల్లో ఇలా చేయ‌డం ఇది రెండోసారి. ఈ మిస్సైల్ జపాన్ ఉత్త‌ర‌భాగంలోని హొకైడో మీదుగా వెళ్లి ప‌సిఫిక్‌ లో ప‌డిన‌ట్లు ద‌క్షిణ కొరియా - జ‌పాన్ అధికారులు వెల్ల‌డించారు. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ప్ర‌యోగించిన ఈ మిస్సైల్ గ‌రిష్ఠంగా 770 కిలోమీట‌ర్ల ఎత్తులో.. 3700 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది.

హొకైడోకు తూర్పు దిశ‌గా 2 వేల కిలోమీట‌ర్ల దూరంలో మిస్సైల్ ప‌డిన‌ట్లు జ‌పాన్ చీఫ్ కేబినెట్ సెక్ర‌ట‌రీ యోషిహిడె సుగా తెలిపారు. ప‌దేప‌దే ఉత్తర కొరియా ఇలా రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డటం స‌రి కాద‌ని, దీనిపై తీవ్ర నిర‌స‌న తెలుపుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబె కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను స‌హించ‌బోమ‌ని, ఉత్త‌ర కొరియా రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లు ప్ర‌పంచ శాంతికి విఘాతం క‌లిగిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. అణ్వాయుధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న ఉత్త‌ర కొరియాపై గురువార‌మే ఐక్య‌రాజ్య స‌మితి 8వ సారి ఆంక్ష‌లు విధించింది. ఆ మ‌రుస‌టి రోజే ఆ దేశం మ‌రోసారి ఇలా మ‌తిలేని చ‌ర్య‌కు పాల్ప‌డింది.

మ‌రోవైపు ఈ తాజా ఘ‌ట‌న‌పై చ‌ర్చించ‌డానికి ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి శుక్ర‌వారం ఎమ‌ర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. అమెరికా, జపాన్ ఈ స‌మావేశం ఏర్పాటుచేయాల‌ని కోరాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8.30 గంట‌ల‌కు ఈ స‌మావేశం ఉంటుంది. మ‌రోవైపు ఇంట‌ర్మీడియ‌ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ (ఐఆర్‌ బీఎమ్‌)ను ప్ర‌యోగించిన‌ట్లు త‌మ‌కు ప్రాథ‌మిక స‌మాచారం ఉన్న‌ద‌ని అటు అమెరికా ప‌సిఫిక్ క‌మాండ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ తాజా మిస్సైల్ లాంచ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివ‌రించారు. న‌వంబ‌ర్‌లో జ‌పాన్‌ తోపాటు సౌత్ కొరియా - చైనా - వియ‌త్నాంల‌లో తాను ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ట్రంప్ గురువార‌మే వెల్ల‌డించారు. అటు ఉత్త‌ర కొరియా మిస్సైల్ లాంచ్‌ కు ప్ర‌తిగా తాము ఓ మిస్సైల్‌ను స‌ముద్రంలోకి ప‌రీక్షించిన‌ట్లు ద‌క్షిణ కొరియా వెల్ల‌డించింది. ద‌క్షిణ కొరియా, జ‌పాన్ దేశాలు ఈ ఘ‌ట‌న‌పై ఎమ‌ర్జెన్సీ నేష‌న‌ల్ సెక్యూరిటీ కౌన్సిల్ స‌మావేశాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.
Tags:    

Similar News