అమెరికాతో యుద్ధానికి మేం రెడీ

Update: 2017-04-11 16:47 GMT
అమెరికా యుద్ధ నౌక‌లు కొరియా తీరం చేర‌డాన్ని ఉత్త‌ర‌ కొరియా సీరియ‌స్ గా తీసుకుంది. అమెరికా ఎటువంటి దాడికి దిగినా దాన్ని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు తాజాగా ఉత్త‌ర కొరియా ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా చేప‌ట్టే క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను శ‌క్తివంత‌మైన ఆయుధాల‌తో ఢీకొంటామ‌ని తేల్చిచెప్పింది. ఈమేర‌కు అమెరికా ఎలాంటి దూకుడు ప్రదర్శించినా దాన్ని ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా అధికారిక వార్తాపత్రిక రాడాంగ్‌ సిన్‌ మున్‌ పేర్కొంది.

అగ్ర‌రాజ్యానికి చెందిన కార్ల్ విన్స‌న్ స్ట్ర‌యిక్ గ్రూపు యుద్ధ నౌక‌లు కొరియా ద్వీప‌క‌ల్పానికి వెళ్తున్నాయి. కార్ల్ విన్స‌న్ నౌక‌ యుద్ధ విమానాల‌ను మోసుకెళ్లుతుంది. ఆ భారీ నౌక‌తో పాటు మ‌రికొన్ని యుద్ధ నౌక‌లు కూడా వివాదాస్ప‌ద కొరియా ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అమెరికా నౌక‌లు ఆక్ర‌మ‌ణకు రావ‌డం దారుణ‌మ‌ని, అగ్ర‌రాజ్య పోక‌డలు ప్ర‌మాద‌క‌ర ద‌శ‌కు చేరుకున్నాయ‌ని పేర్కొంది. ఇటీవ‌ల ద‌క్షిణ కొరియాలో సైనిక శిక్ష‌ణ పూర్తి చేసిన కార్ల్ విన్స‌న్ యుద్ధ నౌక‌లు సింగ‌పూర్ నుంచి ప‌శ్చిమ ప‌సిపిక్ తీరానికి క‌దులుతున్నాయి. అమెరికా ఎటువంటి యుద్ధానికి సిద్ధ‌మైనా దాన్ని ఎదుర్కొనేందుకు తాము రెఢీగా ఉన్నామ‌ని కొరియా స్ప‌ష్టం చేసింది.

అమెరికా నౌక‌లు కొరియా ద్వీప క‌ల్పానికి చేరుతున్న క్ర‌మంలో ద‌క్షిణ కొరియా - చైనాలో రంగంలోకి దిగాయి. మ‌రోసారి ఉత్త‌ర కొరియా మిస్సైల్ ప‌రీక్షలు నిర్వ‌హించకుండా ఉండేందుకు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. చైనా ఇప్ప‌టికే నార్త్ కొరియాపై ఆర్థిక‌ ఆంక్ష‌లు విధించింది. అయితే త్వ‌ర‌లో నార్త్ కొరియా ఖండాంత‌ర క్షిప‌ణిని ప్ర‌యోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వార్షికోత్సవం సహా ఏ వార్షికోత్సవాలు జరిగినా ఉత్తర కొరియా మరోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని హ్వాంగ్‌ చెప్పారు. ఈ శనివారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాత, ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ 105వ జయంతి. దాంతో రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో సైనిక కవాతు జరుగుతుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ తన అణ్వస్త్ర లేదా క్షిపణి సామర్థ్యాలను ఇలాంటి వార్షికోత్సవాల సమయంలో ప్రదర్శించడం ఉత్తరకొరియాకు ప‌రిపాటి. ఈ నేప‌థ్యంలో ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News