ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కిమ్ వీడియో

Update: 2017-08-22 10:31 GMT
పిచ్చోడి చేతిలో రాయి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైందో.. ఎలాంటి బాధ్య‌త లేకుండా అగ్ర‌రాజ్య‌మైన అమెరికా మీద కోపం.. క‌సిని పెంచుకున్న ఉత్త‌ర‌కొరియా అధినేత తీరు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. అణ్వ‌స్త్ర ఆయుధాలు త‌యారుచేసే స‌త్తా లేన‌ప్ప‌టికీ.. ర‌ష్యా లాంటి ర‌హ‌స్య మిత్రుడి సాయంతో శ‌క్తివంత‌మైన అణ్వ‌స్త్రాల్ని సొంతం చేసుకుంది. మొన్న‌టి వ‌ర‌కూ అమెరికాకు చెందిన గువాం ద్వీపంపై అణ్వ‌స్త్రాల‌తో దాడి చేస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌.. చైనా జోక్యంతో త‌న దూకుడుకు బ్రేకులు వేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌న ప‌క్క‌నే ఉన్న ద‌క్షిణ కొరియాతో క‌లిసి అమెరికా మిలిట‌రీ డ్రిల్ చేప‌ట్ట‌టంపై అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. గ‌తంలో అణ్వ‌స్త్ర దాడుల‌తో ఎలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతుందో తెలియ‌జేసే వీడియోల‌తో కాక పుట్టించిన ఉత్త‌ర కొరియా.. తాజాగా అలాంటి ప‌నే చేసింది. అణ్వ‌స్త్ర క్షిప‌ణుల‌తో గువాం ద్వీపంపై తాము విరుచుకుప‌డితే ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టేలా ఒక వీడియోను విడుద‌ల చేసింది.

ఉత్త‌ర కొరియా ద్వారా విడుద‌ల చేసిన‌ట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో దాడి తీరు తెన్నుల‌తో పాటు.. దాడి అనంత‌రం అమెరికాలో ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌మాధి సిలువుల‌తో నిండిపోతుంది. పాపాత్ములైన అమెరికాన్ల‌కు న‌ర‌క‌మే గ‌తి అంటూ ఇష్టారాజ్యంగా వీడియోలో మండిప‌డింది. ప్ర‌పంచంలో అత్యుత్త‌ముల‌మ‌ని అమెరికా మూర్ఖులు ఊహ‌ల్లో తేలిపోతున్నార‌ని ఘాటు విమ‌ర్శ‌తో పాటు.. తాము ప్ర‌యోగించే హ‌వాంగ్ 14 న్యూక్లియ‌ర్ మిస్సైల్ అమెరికాను నాశ‌నం చేస్తుంద‌న్న అంచ‌నాను వ్య‌క్తం చేసింది.

తాజాగా విడుద‌లైన వీడియో ప్ర‌పంచ దేశాల్ని వ‌ణికిస్తోంది. మూడో ప్ర‌పంచ యుద్ధం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? అన్న సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉత్త‌ర కొరియాతో యుద్ధానికి అమెరికాకు ప్ర‌పంచ దేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అమెరికాపై మొద‌టి బాంబు ఉత్త‌ర‌కొరియా కానీ వేస్తే.. త‌మ మ‌ద్ద‌తు పూర్తిగా అమెరికాకే ఉంటుంద‌ని చైనా చెబుతోంది.

ఇదిలా ఉంటే.. వీడియోల‌తోనూ.. బాధ్య‌తారాహిత్య‌మైన వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నంగా మారిన ఉత్త‌ర‌కొరియాకు అణ్వ‌స్త్ర ఆయుధాల్ని త‌యారు చేసుకునే స‌త్తా లేద‌ని అమెరికా భావిస్తోంది. అయితే.. ర‌ష్యా ర‌హ‌స్య స‌హ‌కారంతో ఈ సాంకేతిక‌త‌ను ఉత్త‌ర కొరియా సొంతం చేసుకొని ఉండొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉక్రెయిన్ లోని ఒక ఫ్యాక్ట‌రీలో ర‌ష్యా స‌హ‌కారంతో ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణి త‌యారీని మొద‌లెట్టింద‌న్న అనుమానం ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ సందేహంగా ఉన్న ఈ విష‌యం మీద క్లారిటీ వ‌చ్చి.. ఉత్త‌ర‌కొరియా అణ్వ‌స్త్రాల వెనుక ఉన్న‌ది తామేన‌న్న విష‌యాన్ని ర‌ష్యా ఎక్క‌డా పేర్కొన‌టం లేదు. ప్ర‌స్తుతం ఉన్న ఉద్రిక్త‌త‌లు ఎక్కువైన వేళ‌లో.. ఉత్త‌ర‌కొరియా వెనుక  ఉన్న‌ది ర‌ష్యా అని  తేలితే అదో ప్ర‌ళ‌యంగా మారి.. మూడో ప్ర‌పంచ యుద్ధానికి తెర తీసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. ఇంత‌కాలం మాట‌ల‌కే ప‌రిమిత‌మైన ఉత్త‌ర‌కొరియా యుద్ధానికి తెగితే.. తాను ముందుకు వ‌చ్చి మాట్లాడ‌తాన‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. కిమ్ లాంటి మొండోడు.. పెంకి ఘ‌టాన్ని పుతిన్ ఏం చూపించి త‌న మాట నెగ్గేలా చేస్తాడ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Full View
Tags:    

Similar News