యుద్ధానికి అడుగు దూరంలో ప్ర‌పంచం!

Update: 2017-09-26 17:30 GMT
ఒక వ్య‌క్తి  ప్ర‌పంచం మొత్తాన్ని ప్ర‌భావితం చేస్తాడా?  కోట్లాది మంది మ‌ర‌ణానికి కార‌ణం అవుతాడా? అన్న సందేహాలు చ‌రిత్ర పాఠాలు విన్న‌ప్పుడు.. చ‌దివిన‌ప్పుడు వ‌స్తుంటాయి. అప్ప‌టి కాలాన్ని చూసి ఉండ‌క‌పోవ‌టం వ‌ల్లే.. అరే.. అలా చేసి ఉంటే ఇంత వినాశ‌నం ఉండేదా? అన్న సందేహాలు ప‌లువురికి వ‌స్తుంటాయి. కానీ.. ఈ డిజిట‌ల్ ప్ర‌పంచంలోనూ పాత వాస‌న‌లే.

ఒక వ్య‌క్తి దుర్మార్గం.. ఒక వ్య‌క్తి నియంతృత్వ పోక‌డ‌లు ప్ర‌పంచం మొత్తాన్ని ప్ర‌భావితం చేయ‌నున్నాయా?  మ‌రోసారి కోట్లాదిమంది ప్రాణాలు తీయ‌టానికి ఒక నియంత కంక‌ణం క‌ట్టుకున్నాడా? అన్న సందేహాలు రాక మాన‌వు. మ‌నిషి ఇంత ఆధునికం అయ్యాక కూడా.. సాటి మ‌నిషి ప్రాణాల విష‌యంలో ఎలాంటి క‌నిక‌రం లేనిత‌నం అటు కిమ్‌కే కాదు.. ఇటు అగ్ర‌రాజ్య‌మైన అమెరికాలోనూ క‌నిపిస్తుంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య త‌గువు అంత‌కంత‌కూ ముదిరిపోవ‌ట‌మే కాదు.. ప్ర‌పంచం మొత్తాన్ని యుద్ధంలోకి లాగేలా చేస్తుందా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఎవ‌రికి వారు వారి.. వారి స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం కిమ్ లాంటి ప‌ర‌మ కిరాత‌కుడ్ని పెంచి పెద్ద చేశారు. ఎవ‌రికి వారు వారు త‌మ వ్యాపారాల కోసం.. మార్కెట్ విస్తృతి కోసం అణు ఆయుధాల్ని న‌ర‌రూప రాక్ష‌సుడు లాంటి ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఏ క్ష‌ణంలో అయినా పేల‌టానికి సిద్ధంగా ఉన్న ఈ బాంబు ప్ర‌పంచానికి ఎలాంటి ఉప‌ద్ర‌వాన్ని ముంచుకొచ్చేలా చేస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అమెరికా.. ఉత్త‌ర‌కొరియాల మ‌ధ్య న‌డిచిన మాటల యుద్ధం అంత‌కంత‌కూ పెరిగింది.  ఎవ‌రికి వారు యుద్ధ స‌న్నాహాల్లో బిజీగా ఉండ‌టం.. ట్ర‌యిల్స్ వేసుకోవ‌టం చూస్తుంటే మిగిలిన ప్ర‌పంచ‌ప్ర‌జ‌ల‌కు బీపీలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్త‌ర కొరియా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధ‌మైపోతోంది. ఇందులో భాగంగా కొరియా ద్వీప‌క‌ల్పం ద‌గ్గ‌ర్లో ఎగిరే అమెరికా బాంబ‌ర్ల‌ను నేల కూలుస్తామ‌ని ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రిస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌మ దేశంపై యుద్ధం ప్ర‌క‌టించార‌ని.. త‌మ దేశానికి ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు దిగే హ‌క్కు ఉంద‌ని కిమ్ చెబుతున్నాడు.

త‌మ భూభాగంలోకి రాకుండా బాంబ‌ర్ల‌ను కూడా నేల‌కూలుస్తామ‌ని ఉత్త‌ర‌కొరియా విదేశాంగ మంత్రి రి యంగ్ ప్ర‌క‌టించ‌టంతో టెన్ష‌న్ మ‌రింత పెరిగింది. మ‌రోవైపు ఉత్త‌ర కొరియా తూర్పు తీరంలో యుద్ధ స‌న్నాహాలు చేస్తోంది. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసింది. అమెరికా.. ఉత్త‌ర కొరియాల మ‌ధ్య కానీ యుద్ధం మొద‌లైతే ఇది ఆ రెండు దేశాల మ‌ధ్య ఆగ‌ద‌న్న‌ది సుస్ప‌ష్టం. ఇద్ద‌రి మ‌ధ్య మొద‌ల‌య్యే వార్ లోకి ప్ర‌పంచాన్ని బ‌ల‌వంతంగా లాగుతారా?  లేక నిలువ‌రిస్తారా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News