ఉత్తరాంధ్ర మంత్రులకు పదవి భయం పట్టుకుందే

Update: 2022-10-08 05:34 GMT
విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వెంటనే పరిపాలన మొదలు పెట్టాలనే డిమాండ్ తో మంత్రులు రాజీనామాలు చేస్తారా ? రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన వల్ల జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతుగా జనాలు, ముఖ్యమంత్రి అనుమతిస్తే వెంటనే మంత్రిగా రాజీనామా చేసి ఉద్యమం చేయాలనే ఆలోచన ఉందని ధర్మాన చెప్పారు. ఒకపుడు మంత్రుల రాజీనామా అనే సెంటిమెంటు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో తెలంగాణా ప్రాంత మంత్రులపై పనిచేసింది.

ఇంతకాలానికి మళ్ళీ అలాంటి ఆలోచనే ఇప్పుడు మంత్రి ధర్మాన నోటివెంట వినబడుతోంది. కాకపోతే ఇపుడు రాష్ట్ర విభజన సమస్య లేకపోయినా మూడు రాజధానులకు మద్దతుగా మంత్రి మాట్లాడారు. ఉద్యమం చేయటం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఉందని ధర్మాన అన్నారంటే ఆటోమేటిగ్గా మిగిలిన మంత్రులపైన కూడా దీని ప్రభావం పడుతుంది.

ఉత్తరాంధ్రలో ధర్మాన కాకుండా బొత్సా, అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర మంత్రులుగా ఉన్నారు. ధర్మాన ప్రకటనతో మా పదవులు ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో అని వీరు ఉలిక్కిపడుతున్నారు.

ధర్మాన ప్రకటనతో పై మంత్రుల నియోజకవర్గాలు, జిల్లాల్లో కూడా జనాలు రాజీనామా డిమాండ్లు చేసే అవకాశముంది. ఈ రాజీనామాల ప్రకటన ఉత్త డ్రామా అయినా లేకపోతే చిత్తశుద్ది ఉన్నా జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికైతే పనికొస్తుంది. ప్రకటనతో ఆగకుండా ధర్మాన రాజీనామా చేసేస్తే జనాల్లో కూడా సెంటిమెంటును రగిల్చినట్లవుతుంది. అపుడు మంత్రుల రాజీనామాల అంశమే పెద్ద విషయంగా మారే అవకాశమూ లేకపోలేదు.

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అమరావతి జేఏసీ నాయకత్వంలో పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సమయానికి అక్కడ రాజీనామాల ప్రకటనలు ఊపందుకుంటే పాదయాత్రను అడ్డుకునేందుకు చూస్తారు.

దాంతో  రెండువైపులా ఉద్రిక్తతలు పెరిగి గొడవలవ్వటం ఖాయం. నిజానికి ఇవన్నీ మంత్రులకు అవసరమే లేదు. మూడు రాజధానులా ? లేకపోతే ఏకైక రాజధాని అమరావతా అనే అంశం మీదే 2024 ఎన్నికలకు వెళితే సరిపోతుంది. జనాలు ఎలా తీర్పుచెబితే అదే ఫైనల్ కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News