కొత్త చట్టంతో కంపెనీలే కాదు సెలబ్రిటీలకు జరిమానాల షాక్!

Update: 2022-09-08 05:16 GMT
తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవటం కోసం కంపెనీలు చెప్పే మాటలు అన్ని ఇన్ని కావు. అమ్మకాలు.. ఆదాయం తప్పించి మరింకేమీ ఆలోచించవు. తమ వ్యూహంలో భాగంగా సెలబ్రిటీలను రంగంలోకి దింపి.. ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంటాయి. కొందరు సెలబ్రిటీలు మినహా చాలామంది తమకు వచ్చిన ఆఫర్ ను వినియోగించి సొమ్ము చేసుకోవటమే తప్పించి.. తాము ప్రమోట్ చేసే బ్రాండ్ కారణంగా జరిగే నష్టం గురించి ఆలోచించరు. సామాజిక బాధ్యతను విస్మరిస్తుంటారు. అలాంటి కంపెనీలకు..

సెలబ్రిటీలకు దిమ్మ తిరిగిపోయే షాకులు ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు కొత్త కసరత్తు చేస్తోంది. సోషల్ మీడియా కట్టడికి త్వరలో మార్గదర్శకాల్ని సిద్ధం చేయటంతో పాటు.. ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తులు తప్పుడు మార్గంలో నడిస్తే అలాంటి ప్రముఖులపై కఠిన చర్యలతో పాటు..భారీ జరిమానాలకు రంగం చేస్తోంది. ఇప్పుడున్న ప్రపంచంలో సోషల్ మీడియా చేస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. నిజానికి ఇవాల్టి రోజున సర్య్కులేట్ అయ్యే తప్పుడు సమాచారంలో సింహభాగం సోషల్ మీడియా.. వాట్సాప్ ల నుంచేనని చెప్పాలి. తాము చెప్పే అసత్యాలకు అందమైన అర్గ్యుమెంట్లను జత చేసే తీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియా చూపే ప్రభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా కొన్ని కంపెనీలు తమ వస్తువుల్ని ప్రమోట్ చేసుకోవటానికి ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా సెలబ్రిటల చేత ప్రచారం చేయిస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేసే సందర్భంగా ఎవరైనా సరే వాస్తవమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా నిబంధనల్ని ఉల్లంఘించిన ఎంతటి సెలబ్రిటీ పైనైనా సరే జరిమానాలు విధిస్తారు.

నిబంధనలు ఉల్లంఘించే సెలబ్రిటీలకు కనిష్ఠంగా రూ.10లక్షలు మొదలు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజల్ని రక్షించేందుకు వీలుగా కేంద్రం ఈ చర్యల్ని తీసుకోనుంది. బ్రాండ్ లు.. సేవలకు సంబంధించిన నకిలీ సమీక్షల నుంచి ఆన్ లైన్ వినియోగదారుడ్ని రక్షించటమే లక్ష్యంగా సరికొత్త మార్గదర్శకాలు ఉండనున్నాయి. అంతేకాదు.. బ్లాగర్లను సైతం దీని పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే కంపెనీల నుంచి ఇతర వ్యక్తుల నుంచి ఉచితంగా వస్తువులు తీసుకొని వాటికి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు.. అలా పొందిన వస్తువులకు ముందస్తుగా 10 శాతం టీడీఎస్ ను సైతం చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ సదరు సెలబ్రిటీ తాము పొందిన వస్తువును తిరిగి కంపెనీకి తిరిగి ఇచ్చేసిన పక్షంలో తాము చెల్లించిన 10 శాతం టీడీఎస్ ను తిరిగి పొందేందుకువీలు ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు ఇప్పటి మాదిరి సోషల్ మీడియాలో తమకు తోచినట్లుగా రివ్యూలు ఇచ్చే బ్లాగర్లు.. ఏదో ఒక ఉత్పత్తికి ప్రచారం చేసే వారికి కొత్త మార్గదర్శకాలతో షాకులే షాకులన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News