లోకేశ్‌ కు షాక్‌!... జూనియ‌ర్‌ కు ప‌గ్గాలివ్వాల‌ట‌!

Update: 2018-02-04 07:25 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు పెట్టుబడులు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్... అక్క‌డ రోజుల త‌ర‌బ‌డి క‌ష్టప‌డుతున్నారు. త‌న తండ్రి - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో క‌లిసి దావోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సుకు బ‌య‌లేదేరిన లోకేశ్... చంద్ర‌బాబు తిరిగి రాష్ట్రానికి రాగా ఆయ‌న మాత్రం అటు నుంచి అటే అమెరికా ఫ్లైటెక్కేశారు. అమెరికాలో కాలు మోపింది మొద‌లు... అక్క‌డి ప్ర‌వాసాంధ్రుల‌తో పాటుగా ఏపీఎన్నార్టీఎస్ స‌హ‌కారంతో ప్ర‌ముక కంపెనీల యాజ‌మాన్యాల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ మోస్త‌రు కంపెనీలను ఏపీకి వ‌చ్చేలా ఒప్పించేసిన‌ట్లుగా క‌ల‌రింగ్ ఇచ్చేసుకుంటున్న లోకేశ్... ఇప్పుడ‌ప్పుడే రాష్ట్రానికి తిరిగి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

అక్క‌డ జ‌రుగుతున్న భేటీల్లో ఏ మేర ఫ‌లితాలు వ‌స్తున్నాయో తెలియ‌దు గానీ... టీడీపీ అనుకూల మీడియా మాత్రం లోకేశ్ బాగానే పొడిచేస్తున్నార‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాసేస్తున్నాయి. ఏపీకి ప్ర‌ముఖ కంపెనీల‌ను రాబ‌ట్ట‌డంలో లోకేశ్ భారీగా క‌ష్టప‌డుతున్నార‌ని, ఆ దిశ‌గా ఇప్ప‌టికే చాలా కంపెనీలు ఏపీకి రావ‌డానికి సుముఖ‌త వ్య‌క్తం చేశాయ‌ని ఆ క‌థ‌నాలు తెలిపాయి. ఏపీకి కంపెనీల‌ను ర‌ప్పించే విష‌యంలో లోకేశ్ స‌ఫ‌లీకృతుడైతే అంత‌కంటే సంతోషం ఏముంటుంది? ఈ దిశ‌గా కొంద‌రికి అనుమానాలు - కొంద‌రికి న‌మ్మ‌కాలున్నా... లోకేశ్ స‌త్తా ఏమిటో మ‌రికొన్ని రోజులు పోతే గానీ తేలేలా లేద‌నే చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నా... నిన్న ప్ర‌వాసాంధ్రుల భేటీ కోస‌మంటూ హుషారుగా బ‌య‌లుదేరిన లోకేశ్ కు పెద్ద షాకే త‌గిలినట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

తానేదో ఏపీకి కంపెనీల‌ను రాబ‌ట్టేందుకు లోకేశ్ అమెరికా వెళితే... అక్క‌డి ప్ర‌వాసాంధ్రులు మాత్రం తెలంగాణ‌లో టీడీపీ ఎదుర్కొంటున్న గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఏక‌రువు పెట్టారు. తెలంగాణ‌లో పార్టీ చ‌చ్చిపోతున్నా... ఏమీ ప‌ట్ట‌న‌ట్టుగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తారంటూ లోకేశ్ ను ఎన్నారైలు నిల‌దీశార‌ట‌. అంతేకాకుండా తెలంగాణ‌లో పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే... ఇదొక్క‌టే స‌రైన మందు అని కూడా వారు లోకేశ్ కు సూచించార‌ట‌. తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతానికి అక్క‌డి వారు ఎంత‌గా ఆలోచిస్తున్నార‌న్న విష‌యం తెలిసి సంతోష‌ప‌డాలో... లేదంటే వారు చేసిన సూచ‌న‌ను విని బాధ‌ప‌డాలో తెలియ‌క లోకేశ్ నానా అవ‌స్థ‌లు ప‌డ్డార‌ట‌. అయినా ప్ర‌వాసాంధ్రులు లోకేశ్ కు చేసిన సూచ‌న ఏమిటంటే... టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌ - పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు రూపు రేఖ‌ల‌ను పుణికిపుచ్చుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ను తెలంగాణ పార్టీ చీఫ్‌ గా నియ‌మించడంతో పాటుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జూనియ‌ర్‌ నే తెలంగాణ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని వారు సూచించారు.

ఈ మాట విన్నంత‌నే లోకేశ్ షాక్‌ కు గుర‌య్యార‌ట‌. ఇప్ప‌టికే పార్టీ తెలంగాణ శాఖ బాధ్య‌త‌ల‌ను లోకేశ్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి చేతిలో పెట్టాల‌ని, ప‌నితీరులో త‌న‌దైన శైలిలో స‌త్తా చాటుతున్న బ్రాహ్మ‌ణి... తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని కూడా వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరును ప్ర‌స్తావించిన ప్ర‌వాసాంధ్రులు నిజంగానే లోకేశ్ కు నోట మాట రాకుండా చేశార‌ని చెప్పాలి. ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చింది కూడా ఏ తెలంగాణ‌కు చెందిన ప్ర‌వాసాంధ్రుడి నుంచో కాద‌ట‌. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన న‌వీన్ అనే ప్ర‌వాసాంధ్రుడు ఈ ప్ర‌తిపాద‌న చేశాడ‌ట‌. ఇదిలా ఉంటే... వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప‌లు సూచ‌న‌లు చేసిన ప్ర‌వాసాంధ్రులు... బీజేపీతో పొత్తుకు క‌టీఫ్ చెప్పి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి ముందుకు సాగ‌డం పార్టీకి ఎంతో లాభిస్తుంద‌ని వారు సూచించార‌ట‌. మొత్తంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరును ప్ర‌స్తావించిన ప్ర‌వాసాంధ్రులు లోకేశ్ కు పెద్ద షాకే ఇచ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News