ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీటమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని... నిలుపరా నీజాతి నిండుగౌరవము అని చిన్నప్పుడు బాగా చదువుకున్నారో లేక భగవద్గీతను మించిన పవిత్ర గ్రంథం లేదని అనుకున్నారో కానీ... ఖండాంతరాల్లో ఉన్నా కూడా భగవద్గీతను, దాని ప్రాముఖ్యతను, దానికున్న పవిత్రతను గుర్తించారు డానియల్ అనే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్! తాను ప్రమాణం చేయడానికి భగవద్గీతనే సాక్షిగా ఎంచుకున్నారు!
వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన డానియల్ మూకీ (32) న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం పార్లమెంటు లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయాలినప్పుడు హిందూ మత పవిత్ర గ్రంధం భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఈయనే కావడం గమనార్హం! డానియల్ మూకీ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. కాగా... ఆస్ట్రేలియాలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడిని తానేనని, దీన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని డానియల్ చెబుతున్నారు!