ఎన్టీఆర్ గండిపేట కుటీరం ఇప్పుడిలా ఉంద‌ట‌

Update: 2017-11-05 05:52 GMT
తెలుగోడి గుండెల్లో నిలిచిపోయే అతికొద్దిమందిలో ఎన్టీవోడు ఒక‌రు. తెలుగువారి మ‌న‌సుల్లో ఆయ‌న స్థానం చెరిగిపోదు. ఆయ‌న వెళ్లిపోయి ద‌శాబ్దాలు అవుతున్నా ఆయ‌న మీద ప్రేమ అంత‌కంత‌కూ పెరుగుతుందే త‌ప్పించి త‌గ్గ‌టం లేదు. చివ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు సైతం ఆయ‌న ఫోటోను వేసుకోవ‌టం క‌నిపిస్తుంద‌. అలాంటి ఎన్టీవోడి గురుతులు ఆయ‌న వార‌సులకు ప‌ట్ట‌క‌పోవ‌టం శోచ‌నీయం.

తెలుగుజాతికి కీల‌క‌మైన వ్య‌క్తుల్లో ఒక‌రైన ఎన్టీఆర్‌కు సంబంధించిన నివాసాల‌కు నిర్ల‌క్ష్య చీడ ప‌ట్టింది. హైద‌రాబాద్‌కు రావ‌టానికి ముందు చెన్నైలో ఉన్న ఆయ‌న నివాసాన్ని ఎలా అయితే ప‌ట్టించుకోవ‌టం మానేశారో.. హైద‌రాబాద్ వ‌చ్చాక ఎంతో ఇష్టంగా సిద్ధం చేసుకున్న గండిపేట కుటీరం ఇప్పుడు ఎవ‌రికి ప‌ట్ట‌న‌ట్లుగా మారిన‌ట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానంలో కీల‌క‌భూమిక పోషించి.. అనేక చారిత్ర‌క ఘ‌ట‌న‌ల‌కు నిలువెత్తు సాక్ష్య‌మైన  ఆశ్ర‌మం ఇప్పుడు ఎవ‌రికి ప‌ట్ట‌న‌ట్లుగా మారింద‌టున్నారు.

హైద‌రాబాద్ శివారుల్లో ఎన్టీవోడు ఎంతో ఇష్ట‌ప‌డి నిర్మించుకున్న గండిపేట శాంతి కుటీరంలో ఎన్టీఆర్ ఎక్కువ‌గా గ‌డిపేవారు. పొద్దున్నే గండిపేట చెరువులో స్నానం చేసి నేరుగా.. కుటీరంలోని ప‌చ్చ‌టి చెట్ల మ‌ధ్య ప‌చార్లు చేసేవారు. అంత‌టి ముఖ్య‌మైన గండిపేట ఆశ్ర‌మం ఇప్పుడు క‌ళ త‌ప్పింది.  

తెలుగుదేశం రాజ‌కీయాల్లో కీల‌క‌మైన నిర్ణ‌యాల్ని ఈ గండిపేట కుటీరం నుంచే తీసుకున్నారు. మొత్తంగా ఒక దేవాల‌యంగా మార్చుకున్నారు. అలాంటి గండిపేట కుటీరం తాజా ప‌రిస్థితి చూస్తే.. ఇప్పుడా కుటీరాన్ని లక్ష్మీ పార్వ‌తి చేతుల్లోఉంది. దాన్లో త‌మ‌కూ వాటా ఉంద‌ని ఎన్టీఆర్ వార‌సులు కోర్టులో కేసు వేశారు. దీంతో న్యాయ వివాదంలో చిక్కుకుంది. దీంతో గండిపేట కుటీరాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేదు.

ఆశ్ర‌మంలో ఎన్టీఆర్ నిర్మించుకున్న వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం శిథిలావ‌స్థ‌కు చేరింది. ఎన్టీఆర్ నిత్యం ధ్యానం చేసిన రావి చెట్టూ బోసిపోయింది. ప‌క్షుల గూళ్లు లేవు. ఈ ఆవ‌ర‌ణ‌ను ఆయుర్వేద చికిత్స నిర్వాహ‌కుల‌కు లీజుకు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. పార్టీ పేరిట ఉన్న రెండున్న‌ర ఎక‌రాల్ని చంద్ర‌బాబు అధినేత‌గా ఉన్న టీడీపీకి ద‌క్కాయి. ఆశ్ర‌మానికి అనుకొని ఉన్న 8.5 ఎక‌రాల‌ను టీడీపీ కొనుగోలు చేసి.. మొత్తంగా 11 ఎక‌రాల్లో ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్ ను నిర్వ‌హిస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల పిల్ల‌ల‌కు.. పార్టీకి చెందిన పేద‌ల‌కుఉచితంగా చ‌దువు చెప్పిస్తున్నారు. ఏమైనా.. ఎన్టీవోడికి చెందిన కీల‌క‌మైన ఆశ్ర‌మం గ‌తం ఒక క‌ల‌గా మిగిలిందే త‌ప్పించి.. నాటి క‌ళ నేడు క‌నిపించ‌టం లేద‌న్న‌ది చేదు నిజమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News