ముంబయిలో మెస్ పెట్టిన ఎన్టీవోడు.. ఎందుకంటే?

Update: 2022-05-28 07:30 GMT
ఎన్టీవోడు అన్నంతనే సర్కారు వారి ఉద్యోగాన్ని కాదనుకొని.. చెన్నై రైలెక్కి వెళ్లటం.. అక్కడ తిరుగులేని తారగా మారటం లాంటివి అందరికి తెలిసిన విషయాలే. కానీ.. సర్కారీ కొలువుకు ముందు ఆయన మూడు వ్యాపారాలతో పాటు మరో ఉద్యోగం చేసిన విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇంతకీ ఎన్టీఆర్ చేసిన మూడు వ్యాపారాల గురించి తెలుసా? అంటే చాలామందికి తెలీదనే చెబుతారు. ఇంతకూ ఆయన వ్యాపారం ఎందుకు చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.

ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి. వారికి చెందిన ఇంట్లో సూర్యనారాయణ అనే వ్యక్తి తన కుటుంబంతో అద్దెకు ఉండేవారు. తర్వాతి కాలంలో వారు ముంబయి (అప్పటి బాంబే) వెళ్లిపోయి వ్యాపారం చేస్తుండేవారు. అనూహ్యంగా బిజినెస్ పార్టనర్స్ చేసిన మోసం కారణంగా ఆయన దొంగ కేసును ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మయ్య చౌదరి.. తన కొడుకు ఎన్టీఆర్ ను ముంబయికి పంపారు. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి సాయంగా ఉండమని చెప్పారు. దీంతో.. ముంబయి వెళ్లిన ఎన్టీఆర్.. ప్రతి రోజు 8 కిలోమీటర్లు నడిచి కోర్టుకు వెళ్లేవారు.

న్యాయస్థానంలో అందించాల్సిన పత్రాల్ని ఎలాంటి తప్పులు లేకుండా అందించేవారు. ఆ కేసులో సూర్యనారాయణ నిర్దోషిగా బయటపడ్డారు. ఆ టైంలోనే ఎన్టీఆర్ ముంబయిలో ఒక మెస్ పెట్టారు. కేవలం నెల మాత్రమే నడిపిన ఆ మెస్ ను తర్వాత ఆపేశారు. దీనికి కారణం ఎన్టీఆర్ తండ్రే. ఆయనకు మెస్ పెట్టటం ఇష్టం లేకపోవటంతో దాన్ని వదిలేశారు. తర్వాతి కాలంలో విజయవాడలో పొగాడు వ్యాపారాన్ని.. ఆ రంగంలో మంచి పట్టు ఉన్న ఫ్రెండ్ తో కలిసి మొదలు పెట్టారు. అయితే.. మిత్రుడి మరణంతో ఆ వ్యాపారాన్ని వదిలేశారు.

ఆ తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అది కాస్తా నష్టాలు రావటంతో దాన్ని ఆపేశారు. బీఏ చదువుతున్న సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ఐఏసీటీ క్యాడెట్ గా ట్రైనింగ్ పొందారు. ఎయిర్ పోర్టులో ఫ్లైయింగ్ ప్రాక్టికల్స్ చేశారు.

ఆ తర్వాత కింగ్స్  కమిషన్ సంస్థకు ఎయిర్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అయితే.. అందుకు భార్య బసవతారకం.. తల్లిదండ్రులు వద్దని చెప్పటంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగాన్ని సాధించారు. 1947 అక్టోబరులో గుంటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గా అడుగు పెట్టారు.

ఆఫీసులో అడుగు పెట్టిన మొదటిరోజునే ఆయన కోటులో ప్యూను.. కొంత డబ్బులు పెట్టటం.. ఆ రోజుకు వచ్చిన కలెక్షన్ లో భాగం. ఈ పద్దతి ఎన్టీఆర్ కు నచ్చలేదు. తన ఆత్మను.. తన కళను ఆఫీసులో అమ్ముకోవాల్సి వస్తోందని తన మిత్రుడు కొంగర జగ్గయ్యకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేయాలనుకున్న ఆయన ఇంట్లో వారితో మాట్లాడి.. అందరిని ఒప్పించి మద్రాసు రైలు ఎక్కేశారు. ఆ తర్వాత జరిగింది తెలుగు ప్రజలందరికి తెలిసిందే. ఇలా విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు కావటానికి ముందు ఎన్టీఆర్ జీవితంలో మూడు వ్యాపారాలు.. రెండు ఉద్యోగాలు ఉన్నాయి.
Tags:    

Similar News