తెలుగు జాతికి కేరాఫ్ ఎన్టీయార్...ఇదెక్కడ లాజిక్కు బాలయ్యా...?

Update: 2022-09-24 09:18 GMT
ఎన్టీయార్ తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపచేసిన వారిలో తానూ ఒకరు. ఆయన తెలుగు వెలుగులను నలుదిశలా ప్రసరింపచేశారు. తన ముఖ్యమంత్రిత్వంలో ఆయన చాలా గొప్ప  కార్యక్రమాలు చేశారు. అయితే వేల సంవత్సరాల‌ చరిత్ర కలిగిన తెలుగు జాతికి ఎన్టీయార్ ఒక్కరే  కేరాఫ్ అన్నట్లుగా ఆయన కుమారుడు సినీ నటుడు బాలక్రిష్ణ కొన్ని కామెంట్స్ చేయడం పైన చర్చ సాగుతోంది.

ఎన్టీయార్ తెలుగు జాతి వెన్నెముక అని ఆయనే సంస్కృతి అని, ఆయన తెలుగు నాగరికత అని అర్ధం వచ్చేలా బాలయ్య చేస్తున్న కామెంట్స్ మీదనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీయార్ 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కంటే ముందు తెలుగు రాష్ట్రానికి ఎంతో మంది సీఎం లుగా చేశారు. వారిలో బ్రిటిష్ వారి గుండుకు గుండెను ఎదురుగా నిలిపిన సాహసి  ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం ఉన్నారు.

అలాగే నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య, జలగం వెంగలరావు లాంటి ముఖ్యమంత్రులు ఉమ్మడి ఏపీని సమర్ధంగా పాలించి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక తెలుగు సంస్కృతి కి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఎంతో మంది కవులు, కళాకారులు, మేధావులు తెలుగు నేల మీద పుట్టి సుసంపన్నం చేశారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి తాను ఆత్మాహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములుని ఎవరైనా మరచిపోగలరా.

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ విశ్వ గీతికను రచించిన గురజాడ అప్పారావు తెలుగు జాతికి వెలుగు రేఖ అని చెప్పకుండా ఉండగలమా. ఇక వేయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని తీసుకుంటే ఆదికవి నన్నయ్య నుంచి ఆధునిక  కవి విశ్వనాధ సత్యనారాయణ వరకూ ఎందరో తెలుగు వైభవాన్ని నలు చెరగులా నింపి గొప్ప కీర్తిని తెచ్చారు.

అలాగే కళా సాంస్కృతిక రంగాలలో ఎందరో మేటి ఘనాపాటీలు ఉన్నారు. ఇక తెలుగు నేలను ఎందరో రాజులు గొప్పగా పాలించి తమ సత్తా చాటారు. అలాంటి కర్నాటక ఆంధ్రాలను కలిపి పాలించిన క్రిష్ణ‌దేవరాయల కీర్తిని, రాణీ రుద్రమ్మ పౌరుషాన్ని మరచిపోగలరా. ఇలా ఒకరని కాదు ఎందరో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పారు.

ఎన్టీయార్ సినీ నటుడుగా ఎన్నో మంచి పాత్రలు వేయవచ్చు. ఆయన‌తో పాటు సరిసమానంగా ఏయన్నార్ కూడా ఉన్న సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రాజకీయ రంగంలో చూసుకున్నా ఎన్టీయార్ ముందూ తరువాత కూడా అనేక మంది నాయకులు పాలించి తమ ముద్ర వేసుకున్నారని చెప్పాలి.

అలాంటిది తెలుగు జాతి ఖ్యాతి అంటే కేరాఫ్ ఎన్టీయార్ అని అర్ధం వచ్చేలా బాలయ్య లాంటి వారు ఎలా అనగలరని మేధావులు అంటున్నారు. ఎన్టీయార్ గొప్పవారు, ఆయన మేరు నగధీరుడు. తెలుగు కీర్తిని మరికొన్ని మెట్లు ఎక్కించిన ప్రముఖుడు. అయితే తెలుగు అన్నా తెలుగు జాతి అన్నా ఆయన ఒక్కరే కాదని అంతా గుర్తించాల్సిన విషయం అని అంటున్నారు. ఎన్టీయార్ పేరు హెల్త్ వర్శిటీ నుంచి తొలగించడం దారుణం. ఈ విషయంలో ఎవరికీ రెండో రకమైన అభిప్రాయమే  లేదు.

అదే సమయంలో ఎన్టీయార్ అంటే కేరాఫ్ తెలుగు జాతి అని చెప్పడమే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎన్టీయార్ పేరు తొలగింపు మీద బాలయ్య లాంటి వారు గట్టిగా పోరాడాలి. అదే విధంగా రాజకీయాలకు అతీతంగా అంతా కూడా ప్రభుత్వ చర్యను తప్పుపట్టాలి.  అయితే  ఈ రకమైన ఆవేశాన  ఒక వ్యక్తికో ఒక పేరుకో యావత్తు వేల సంవత్సవార తెలుగు శక్తిని జాతిని గాటకు కట్టేసి చూడడం అంటే తెలుగు జాతి చిన్నబోతున్నట్లే లెక్క.

ఈ భూమి ఉన్నంతవరకూ తెలుగు జాతి గౌరవం ఉంటుంది. ఇంకా ఎందరో పుట్టుకువచ్చి తెలుగు వెలుగులను ఎల్లెడలా చాటుతారు. అది నిరంతర యాగం. అందువల్ల తెలుగు జాతి దాని ఖ్యాతీ ఎపుడూ ఆరని జ్యోతిగానే  ఉంటుందని అంతా గుర్తెరిగితే మంచిది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News