పెద్ద బిల్డింగుంది.. అందులో మనుషులే లేరు!

Update: 2016-08-22 11:44 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇది కొత్తగా వినిపిస్తున్న ఏడుపు. తెలంగాణ రాష్ట్ర సమితి దెబ్బకి తెలుగుదేశం పార్టీ కుదేలైపోయి - ఏదో మొక్కుబడిగా ఇక్కడ బతుకీడుస్తున్న సంగతి తెలిసిందే. గట్టిగా లెక్కవేస్తే.. ఆ పార్టీకి శాసనసభలో రెండుంపావు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అవును మరి.. ఆర్‌.కృష్ణయ్యను పావు ఎమ్మెల్యేగా లెక్కవేయాల్సిందే. ఆయన ఖాతాలోకి తప్ప.. వ్యవహారంలోకి తెలుగుదేశం ఎమ్మెల్యేలాగా ప్రవర్తించడం ఎన్నడో మానేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెదేపాకు.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ రూపంలో జూబ్లీహిల్స్‌ అతిపెద్ద ఆఫీసు ఉంది. అయితే.. ఏపీ సెపరేట్‌ అయిపోయిన తర్వాత.. చంద్రబాబు.. ఆయన కేబినెట్‌ మంత్రులు తదితరులంతా పెట్టేబేడా సర్దుకుని హైదరాబాదు విడిచి వెళ్లిపోయిన తర్వాత.. ఈ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చే దిక్కే లేకుండా పోయారు.

తాజాగా ఈ భవన్‌ను రెండు ముక్కలుగా విడగొట్టి ఒకటి - రెండో ఫ్లోర్‌ లను పూర్తిస్థాయిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకే కేటాయించారు. చాలా విశాలమైన ఆఫీసు ప్రాంగణం తెదేపాకు దక్కినట్లయింది. ఆర్భాటాలకు పేరుమోసిన రేవంత్‌ రెడ్డి - పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయించి.. అక్కడినుంచి సైకిల్‌ ర్యాలీగా వచ్చి ఆఫీసును ప్రారంభించారు కూడా!

అయితే తెతెదేపా నాయకులు ఇప్పుడు సతమతం అయిపోతున్నారు. చాలా విశాలమైన ప్రాంగణంతో అతిపెద్ద ఆఫీసు తమకు ఉన్నది గానీ.. అందులో ఉండడానికి కార్యకర్తలు  - నాయకులు ఎవ్వరూ లేరని వారు వాపోతున్నారట. ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఠికానీ లేని పార్టీ కార్యాలయానికి జిల్లాలనుంచి వచ్చే కార్యకర్తల సంఖ్య కూడా చాలా తక్కువ. ఆ నేపథ్యంలో తెలంగాణ వాటాకు వచ్చిన ట్రస్ట్‌ భవన్‌ బోసిపోయినట్లు కనిపిస్తోందిట. ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని ఎవరు చూసినా ఇక్కడ మన పార్టీ దీనావస్థ తెలిసిపోతుందని పార్టీ నాయకులే చింతిస్తున్నారట పాపం!!
Tags:    

Similar News