ఎన్టీఆర్ మ్యూజియం ప్రత్యేకతలివే!

Update: 2017-01-19 07:06 GMT
న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో తెలుగుదేశం పార్టీ త‌న‌దైన మార్కు వేయాల‌ని సంక‌ల్పించింది. అందులో భాగంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త ఎన్టీఆర్ స్మార‌కార్థం భారీ మ్యూజియాన్ని ఏర్పాటుచేయ‌నుంది. ఈ ప్రాజెక్టును నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్ చేప‌ట్ట‌డం విశేషం.

ఎన్టీఆర్ అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు రాముడు - కృష్ణుడు - క‌ర్ణుడు - భీముడు - దుర్యోధ‌నుడు... ఇలా ఎన్నో పాత్ర‌లు క‌ళ్ల‌ముందు మెదులుతాయి. అలాగే ఆయ‌న రాజ‌కీయ జీవితం విష‌యానికొస్తే కాకీ వ‌స్త్ర ధార‌ణ‌ - త‌ల‌పాగా గుర్తుకొస్తాయి. రెండు రూపాయ‌లకు కిలో బియ్యం వంటి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు - అప్ప‌టి కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వంలో కీల‌క‌పాత్ర‌... ఇలా ఆయ‌న సాధించిన‌ విజ‌యాలు ఎన్నో.. ఎన్నెన్నో.. మరెన్నో! యావ‌ద్భార‌త దేశానికీ తెలుగోడి స‌త్తా ఏంటో చూపించిన ఆ మ‌హానేత గురించి భావి త‌రాల‌కు తెలియ‌జేసేందుకు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ న‌డుం బిగించింది. అందులో భాగంగా ఆయ‌న పేరిట అధునాత‌న‌ మ్యూజియాన్ని న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించారు.

ప‌ది ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ మ్యూజియంలో ఎన్టీఆర్ బాల్యం - విద్యాభ్యాసం - సినీ - రాజ‌కీయ జీవితాల‌కు సంబంధించిన చిత్రాల‌తో గ్యాల‌రీలు ఉంటాయి. ఒక గ్రంథాల‌యాన్ని కూడా ఏర్పాటుచేస్తారు. ఎన్టీఆర్ రాతి శిల్పాలు - త్రీడీ బొమ్మ‌లు చూప‌రుల‌ను అబ్బుర‌ప‌రిచేలా పెట్ట‌నున్నారు. ద‌క్షిణ భార‌త చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌ను వివ‌రించే పుస్త‌కాలు - ఫొటోలు - వీడియోలూ ఇందులో ఉంచుతారు. అంతేకాదు, రెండువేల‌మంది కూర్చునేందుకు వీలుగా భారీ ఆడిటోరియాన్ని నిర్మించనున్నారని తెలుస్తుంది.

ఇంత భారీ స్థాయిలో మ్యూజియాన్ని నిర్మించాలంటే మాట‌లా. అందుకే క‌స‌ర‌త్తును ఇప్ప‌ట్నుంచే ప్రారంభించింది ఎన్టీఆర్ ట్ర‌స్టు. ఇందులో భాగంగా అమెరికా, యూర‌ప్‌ ల‌లోని అంత‌ర్జాతీయ మ్యూజియాలు - ద‌క్షిణాఫ్రికా మాజీ అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేలా మ్యూజియాన్నీ సంద‌ర్శించనున్నారు ట్ర‌స్టు ప్ర‌తినిధులు. ఇవ‌న్నీ చూశాక వీటికి ఏమాత్రం త‌క్కువ కాకుండా, అంత‌ర్జాతీయ స్థాయి మ్యూజియాన్ని మూడేళ్ల‌లో నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది ట్ర‌స్టు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News