అణు విద్యుత్ : కోత‌లు నివారించాలంటే కొవ్వాడే కావాలి ? అంతేనంటారా?

Update: 2022-02-09 04:30 GMT
ప్ర‌స్తుతం ఆంధ్రావ‌నిలో విద్యుత్ కోత‌లు షురూ అయ్యాయి.కోతల నివార‌ణ‌కు కేంద్రం ఓ మార్గం చెప్పింది.దానికి వైసీపీ త‌ల ఊపింది. సాయిరెడ్డి ఎప్ప‌టిలానే కేంద్రానికి థాంక్స్ చెప్పారు.ఒక్క‌సారి అదెలానో చూద్దాం.శ్రీ‌కాకుళం జిల్లా,ర‌ణ స్థ‌లం మండ‌లం, కొవ్వాడ‌లో ప్ర‌తిపాదిత అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయింది.

అయితే ప్ర‌తిపాదిత అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై క‌మ్యూనిస్టులు ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ కానీ వైస్సార్సీపీ కానీ ఈ నిర‌స‌న‌ల‌ను త‌మకు రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగానే వాడుకున్నాయి. దీంతో వివాదం రాజ‌కీయ రంగం పులుముకుందే త‌ప్ప స‌మ‌స్య అయితే ప‌రిష్కారానికి నోచుకోలేదు.

2014 - 19కి ముందు కొంత క‌థ న‌డిచింది. ప్లాంటు కు సంబంధించి క‌ళా వెంకట్రావు చాలా హంగామా చేశారు. నిర‌స‌న దీక్ష‌ల్లో పాల్గొని పర్యావ‌ర‌ణ హితం కోరి తాను ఈ ప్లాంట్ వ‌ద్ద‌ని చెబుతున్నాన‌ని అంటూ తెగ హ‌డావుడి చేశారు. తీరా టీడీపీ అధికారంలోకి రాగానే ప్లాంటు ఏర్పాటును వ్య‌తిరేకించ‌లేక‌పోయారు. అటుపై క‌ళా వెంకట్రావు చిత్తు చిత్తుగా ఓడిపోయారు.

యువ‌కుడు గొర్లె కిర‌ణ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. గొర్లె కిర‌ణ్ కూడా వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్లాంటు ర‌ద్దుపై ప‌ట్టుబ‌డ‌తాననే చెప్పారు. ప్ర‌జాభీష్టం నెర‌వేరుస్తానే చెప్పారు.దీంతో న్యూక్లియ‌ర్ ప్లాంటు ఏర్పాటు అన్న‌ది నాయ‌కులకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది.

పోనీ ఈ చిన్నా చిత‌కా నాయ‌కుల సంగ‌తి వ‌దిలేద్దాం.. ఆ రోజు జ‌గ‌న్ త‌న పాద‌యాత్రలో ప్లాంటు ఏర్పాటును సైతం వ్య‌తిరేకించి, అత్యంత ప్ర‌మాదాల‌కు నెల‌వుగా ఉండే ఈ ప్లాంటు ను ఇక్క‌డే వ‌ద్ద‌నే కేంద్రానికి తాము చెబుతామ‌ని అన్నారు. కానీ ఇప్పుడు విజ‌య సాయిరెడ్డి ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌వ‌ర్ క‌ట్స్ నివార‌ణ‌కు కొవ్వాడ‌లో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావ‌డం ఎంతో ఆనంద దాయ‌కం అని చెప్ప‌డం విడ్డూరం.  

ఇంత‌కుమించిన వంచ‌న మ‌రొక‌టి లేద‌ని  క‌మ్యూనిస్టులు మండిప‌డుతున్నారు.అయినా కూడా ప్లాంటు రాక అన్నది షురూ కానుంది. విద్యుత్ సంక్షోభాల‌ను నివారించాలంటే అయితే థ‌ర్మ‌ల్ విద్యుత్ లేదా అణువిద్యుత్ ప్లాంట్ల‌ను నెల‌కొల్పితేనే భ‌విష్య‌త్ అవ‌స‌రాలు తీర్చ‌డం సాధ్య‌మ‌న్న ఏకైక భావ‌న‌తో ఇవాళ ప్ర‌భుత్వాలు ఉన్నాయి.

ఇదే స‌మ‌యంలో వాటి ఏర్పాటు వ‌ల్ల పర్యావ‌ర‌ణానికి జ‌రిగే న‌ష్టాన్ని ఏ విధంగా భ‌ర్తీ చేస్తాయో మాత్రం చెప్ప‌లేక‌పోతున్నాయి. శ్రీ‌కాకుళంలో థ‌ర్మ‌ల్ ప్లాంట్ల ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ  రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో భారీ ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగాయి. కాల్ప‌లు జ‌రిగాయి. ఎంద‌రెంద‌రో ర‌క్త మోడారు. ఫ‌లితంగా సోంపేట, కాక‌రాప‌ల్లిల‌లో ఏర్పాటు చేయ‌ద‌లుచుకున్న థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ఆగింది.

ఆగింది కానీ సంబంధిత జీఓలు మాత్రం అతి తెలివిగా ఆయా ప్లాంట్ల య‌జ‌మానులు తాము సేక‌రించిన భూములు మ‌రో ప్ర‌యోజ‌నం కోసం వాడుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతూ ఆ రోజు టీడీపీ ప్ర‌భుత్వాన్ని దార్లోకి తెచ్చుకున్నాయి. అంటే కాంగ్రెస్ హ‌యాంలో వ్య‌తిరేకించి టీడీపీ అధికారంలోకి రాగానే సంబంధిత జీఓల‌ను త‌మ‌కు అనుగుణంగా మార్చేశారు. బాగుంది ఈ జీఓ ఇప్పించ్చింది అచ్చెన్నాయుడు.

ప్లాంట్ల ర‌ద్దు ఒకే కానీ త‌రువాత జ‌రిగే ప‌నుల‌పై మాత్రం ప్ర‌భుత్వం పెద్ద‌గా బాధ్యత వ‌హించ‌ని విధంగానే టీడీపీ స‌ర్కారు జీఓలు ఉన్నాయి. ఆ విధంగా ఆ రెండు ప్లాంట్లు ఆగినా కూడా రేప‌టి వేళ వాటి నుంచి ఏదో ఒక రూపంలో ప్ర‌కృతికి,ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌మాదం ఉంది.

ఆ రోజు రైతుల నుంచి భూములు లాక్కొన్న ప్లాంటు పెద్ద‌లు ఇప్పుడ‌క్క‌డ  రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ లు కానీ లేదా చేప‌ల చెరువుల ఏర్పాటు కానీ లేదంటే ఆక్వా క‌ల్చ‌ర్ పై కానీ ప్రేమ పెంచుకుంటున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు నిర్థార‌ణ ఇప్ప‌టికిప్పుడు లేక‌పోయినా రేపో మాపో ఏదో ఒక‌టి ప‌చ్చ‌ని నేల‌లో విధ్వంస రూపం జ‌ర‌గ‌నుంది.

ఇక కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంటుకు సంబంధించి ఇప్ప‌టిదాకా సేక‌రించిన భూముల్లో ప‌నులు లేక‌పోయినందున వాటిని ఆక్వా క‌ల్చ‌ర్ కు వినియోగిస్తున్నారు. వీటిని ఆ రోజు టీడీపీ కానీ ఇప్పుడు వైసీపీ కానీ నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఎందుకంటే ఆక్వా క‌ల్చ‌ర్ కార‌ణంగా స‌ముద్రంలో నీళ్లు పూర్తిగా క‌లుషితం అయితే జ‌ల‌చ‌రాల జీవ‌నాన్నే ప్ర‌శ్నార్థకం చేస్తున్నాయి. ఆక్వా క‌ల్చ‌ర్ అన్న‌ది ఎంతో ప్ర‌మాద‌కారిగా ఉన్నా కూడా ఆపే నాథుడే లేడు. సో..వైసీపీకానీ టీడీపీ కానీ ప్లాంట్ల విష‌య‌మై అవ‌లంబిస్తున్న తీరుతెన్నుల విష‌య‌మై రెండూ ఒక్క‌టే! అన్న‌ది ఇవాళ సుస్ప‌ష్టం.
Tags:    

Similar News