చివ‌రి రోజు ఈ ఐదు కీల‌క కేసుల్లో తీర్పు ఇవ్వ‌నున్న ఎన్వీ ర‌మ‌ణ‌!

Update: 2022-08-26 05:36 GMT
సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఎంపికైన రెండో తెలుగు వ్య‌క్తి (మొద‌టి వ్య‌క్తి కోకా సుబ్బారావు)గా రికార్డు సృష్టించిన జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ఆగ‌స్టు 26న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు 48వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా 2022 ఏప్రిల్ 24న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా 16 నెల‌ల‌పాటు కొన‌సాగిన ఆయ‌న అనేక కీల‌క తీర్పులు వెలువ‌రించారు. అంతేకాకుండా రాష్ట్ర‌ప‌తితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించిన అతికొద్ది మంది ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల స‌ర‌స‌న కూడా చేరారు.

త‌న 16 నెల‌ల ప‌ద‌వీ కాలంలో న్యాయ వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించారు. ప్రజలకు న్యాయం వేగంగా అందేలా న్యాయమూర్తుల నియామకాలను జోరుగా చేపట్టారు. అనేక కీల‌క తీర్పుల‌ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హోదాలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వెలువ‌రించారు. దేశంలోని అన్ని హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించారు. అలాగే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించారు.

జస్టిస్‌ రమణ సీజేఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌ ఇప్పటివరకు సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు 250 మందికిపైగా హైకోర్టు జడ్జీలను నియమించింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తిచేయ‌డం విశేషం.

సుప్రీంకోర్టు పాల‌నా విధానంలోనూ అనేక మార్పులు తెచ్చారు. ఏళ్ల త‌ర‌బడి పెండింగ్‌లో ఉన్న కేసుల‌కు ప‌రిష్కారం చూపారు. అధికార పార్టీకి అనుకూల‌మైన తీర్పులు ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేకుండా అత్యున్న‌త ప‌ద‌వికి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వ‌న్నె తెచ్చారు.

కాగా ఆగ‌స్టు 26న ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న చివ‌రి రోజు కీల‌క తీర్పులు ఇస్తార‌ని అంటున్నారు. ముఖ్యంగా ఐదు కేసుల్లో తీర్పులు ఇచ్చి.. త‌న ప‌ద‌వీ కాలం చివ‌రి రోజు కూడా ఆయ‌న రికార్డు సృష్టిస్తార‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 25న 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపి వారి చిరున‌వ్వుల‌కు ఎన్వీ ర‌మ‌ణ కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 26న  రాజ‌కీయ పార్టీల ఎన్నికల ఉచిత హామీలు, 2007 గోరఖ్‌పూర్ అల్లర్లు, కర్ణాటక రాజస్థాన్ మైనింగ్ కేసులు, దివాలా చట్టం కింద లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌పై నిబంధనలు వంటి కేసుల‌పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ తీర్పులు వెలువరించనున్నారు.
Tags:    

Similar News