అమెరికాలో ఎమర్జెన్సీ..ఇంట్లోనే ఉండమంటున్నారు

Update: 2017-03-14 08:00 GMT
అమెరికాలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది. తీవ్రంగా కురుస్తున్న మంచుతో.. అక్కడి పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో జన జీవనం పూర్తిగా స్థంభించింది. రోడ్ల మీద దట్టంగా పరుచుకున్న మంచు కారణంగా వాహనాల్ని రోడ్ల మీదకు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. అంతకంతకూ పెరిగిపోతున్న మంచు కారణంగా బయటకు అడుగుపెట్టటం ప్రమాదకరంగా మారింది. దీంతో.. ఫిలడెల్ఫియాలో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అదే విధంగా విస్కన్సిన్ రాష్ట్రంలోనూ అత్యవసర పరిస్థితిని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

ఈ రెండు రాష్ట్రాలతో పాటు.. పలు నగరాల్లోనూ (మిల్వౌకీ కౌంటీ.. కెనోషా.. వౌవాటోసా.. సెయింట్ ఫ్రాన్సిస్.. వెస్ట్ అల్లీస్..జెర్మన్టౌన్..ప్లెజంట్ ఫ్రెరీ.. సౌక్విల్లీ.. న్యూబర్గ్ తదిత నగరాల్లోనూ వాతావరణ అత్యవసర పరిస్థితిని విధిస్తూనిర్ణయం తీసుకున్నారు. మంచు ముప్పును ఎదుర్కొంటున్న నగరాల్లో న్యూజెర్సీ.. మేరీ లాండ్.. న్యూయార్క్ నగరాలు కూడా ఉన్నాయి.

మంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని.. ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించటం గమనార్హం. మంచు తీవ్రతతో అక్కడి పరిస్థితి ఎంత ఇబ్బందిగా మారిందంటే.. స్కూళ్లు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మంచు తీవ్రత తగ్గిన తర్వాతే స్కూళ్లు.. కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటాయని చెబుతున్నారు. ప్రకృతి విపత్తు నిర్వహణ సిబ్బంది రోడ్ల మీద పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.  వీరికి పోలీసులు సాయం చేస్తున్నారు.ప్రైవేటు ఉద్యోగులకు కూడా సెలవులు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News