పన్నీర్ ఇప్పుడు పెద్ద బాంబే పేల్చారు

Update: 2017-02-08 09:07 GMT
‘‘చెప్పినట్లుగా నడుచుకుంటాడు. బుద్దిగా ఉంటాడు. ఇలాంటి వాడు దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడు’’ ఇలాంటివన్నీ నిన్నటి వరకూ పన్నీరు సెల్వం గురించి చెప్పిన మాటలు. రాత్రికి రాత్రి అదంతా మారిపోవటమే కాదు.. ఆయన ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడాయన లైవ్ సునామీగా మారిపోయారు. గంటగంటకూ తీవ్ర రూపం దాలుస్తున్న ఆయన మాటల ధాటికి చిన్నమ్మ చిన్నబోయే పరిస్థితి.

నిన్న రాత్రి వరకూ సాఫ్ట్ టాయ్ లా వ్యవహరించిన పన్నీర్ ఇప్పుడు షాకుల మీద షాకులిస్తున్నారు. అమ్మ ఆత్మ మాట్లాడమందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఈ రోజు ఉదయం(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. అపోలో ఆసుపత్రిలో చికిత్స చేసినన్ని రోజులు తనను సైతం  అమ్మ దగ్గరకు అనుమతించలేదని.. తాను బలవంతపెట్టలేదని చెప్పిన ఆయన.. అమ్మకు చేసిన చికిత్స మీద పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక ఒక అదృశ్య శక్తి ఉన్నట్లుగా చెప్పిన పన్నీర్.. ‘‘నాకు అర్థం కాని విషయం ఒక్కటే. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆమె ఎందుకంత ఆరాటపడుతున్నారు. తమిళనాడు రాజకీయ పరిస్థితి గురించి ఆమె సరిగా అర్థం చేసుకోవటం లేదు. ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణ రాజీనామా మీద నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.  

అమ్మను ఆసుపత్రిలో చేర్చిన నాటి నుంచి చనిపోయే వరకూ రోజూ మూడు పూటల ఆసుపత్రికి వచ్చిన పన్నీరు సెల్వాన్ని కూడా చిన్నమ్మ లోపలకు అనుమతించని వైనం ఇప్పుడు పలు సందేహాలకు తెర తీసేలా మారింది. చిన్నమ్మ మీద ఎలాంటి ఆరోపణ చేసిన ఓకే కానీ.. అందరిలోనూ అనుమానంగా ఉన్న ఆసుపత్రి ఎపిసోడ్ ను టచ్ చేయటం ద్వారా పన్నీర్ సెల్వం చిన్నమ్మకు చుక్కలు చూపించేందుకే డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎందుకిలా అంటే.. అమ్మకు ఇంత విధేయుడైన ఆయన.. చిన్నమ్మ నుంచి వేరు పడిన తర్వాత మాట్లాడే కంటే.. ముందే.. ఇలాంటి విషయాన్ని చెప్పి ఉంటే బాగుండేది. అలా కాకుండా.. లెక్కలు తేడా వచ్చిన తర్వాత పన్నీరు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు కొత్త తరహా చర్చకు తెర తీశాయని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News