తమిళనాడును ‘అంకెలు’ ఏం చేయనున్నాయ్?

Update: 2017-02-09 05:08 GMT
పాలక అన్నాడీఎంకే లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం అంతకంతకూ ముదిరిపోతున్న సంగతి తెలిసిందే. కీలక నిర్ణయాన్ని తీసుకోవటంలో గవర్నర్ ప్రధాన భూమిక పోషించనున్నారు. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయంలో అంకెలు కీలకభూమిక పోషించనున్నాయ్. చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్ సెల్వం.. ఆమెను సీఎం పదవిని చేపట్టకుండా చేస్తారా? అన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది.

ఇప్పుడు కనిపిస్తున్న బలానికి మరో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కానీ పన్నీర్ పక్షాన నిలిస్తే.. ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయని చెబుతున్నారు. కేవలం డజను మంది ఎమ్మెల్యేలతో పన్నీర్.. సీఎం ఎలాఅవుతారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర ముచ్చట్లు కనిపిస్తాయి. ఎందుకంటే.. గవర్నర్ నిర్ణయంలో ఇప్పుడు అంకెలే కీ రోల్ ప్లే చేయనున్నాయ్ మరి.

ప్రసత్తం తమిళనాడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 233. అమ్మ మరణంతో 233కు చేరిన ఎమ్మెల్యేల బలంతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 117గా మారింది. గవర్నర్ కానీ బలపరీక్ష వైపే మొగ్గు చూపిస్తే.. పరిణామాలు ఆసక్తికరంగా మారతాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం శశికళకు ఉన్న ఎమ్మెల్యేలు 129. అమ్మ పేరుతోనూ.. ఆమె సెంటిమెంట్ పేరు చెప్పి ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తపడుతున్నారు.

వీరిలో డజను మంది చేజారితే సీన్ మొత్తం మారిపోనుంది. ఇక.. పన్నీర్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 5 మాత్రమే. కానీ.. డీఎంకేకు ఉన్న 98.. కాంగ్రెస్ కున్న 8 మందితో పాటు ఐయూఎంఎల్ కు చెందిన మరొకరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే వీలుంది. అదే జరిగితే ఆయన బలం 112గా మారుతుంది.అప్పుడు ఆయన మేజిక్ ఫిగర్ కు కేవలం 5 ఎమ్మెల్యేల దూరంలో మాత్రమే ఉంటారు. చిన్నమ్మ వర్గం నుంచి ఐదారుగురు బయటకు వచ్చేస్తే సీన్ మారిపోతుంది.

దీనికి గవర్నర్ కానీ ఓకేఅంటే.. పన్నీర్ సీఎం పోస్ట్ పదిలంగా ఉన్నట్లే. ఇక స్పీకర్ గా ఉన్న ధనపాలన్ ప్రస్తుతానికి తటస్థంగా ఉండనున్నారు. ఒకవేళ ఇరువర్గా బలం కానీ సమానమైతే.. ఆయన ఓటు కీలకం కానుంది. ఈ మొత్తం చూసినప్పుడు చిన్నమ్మ దగ్గరి ఎమ్మెల్యే  మీదనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News