రెండుసార్లు నవ్వేసి..శుభవార్త చెబుతానన్న పన్నీర్

Update: 2017-02-09 13:01 GMT
అందరూ అతృతగా ఎదురు చూస్తున్న రెండు కీలక భేటీల్లో మొదటిది పూర్తి అయ్యింది. దేశం దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తున్న తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన మీటింగ్ ఒకటి ముగిసింది. అధికార అన్నాడీఎంకే రెండుగా చీలిపోయి.. ఎవరికి వారు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న వేళ.. ముంబయి నుంచి వచ్చిన ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిశారు. అరగంటకు పైగా గవర్నర్ తో భేటీ అనుకున్నప్పటికీ.. ఇరవై నిమిషాల వ్యవధిలోనే తన సమావేశాన్ని ముగించి బయటకు వచ్చారు.

రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన.. మీడియా వర్గాల వైపు చూసి.. చిరు దరహాసం చేయటంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజ్ భవన్ దగ్గర వెయిట్ చేస్తున్న మీడియా వర్గాలను నెమ్మదిగా దాటుకొని వెళ్లిన ఆయన.. తన నివాసానికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. గవర్నర్ భేటీ గురించి క్లుప్తంగా మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజీనామా చేసిన అంశాలపై వివరాలు వెల్లడించటంతో పాటు.. ఏ పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్న అంశంపై వివరాలుచెప్పినట్లుగా పేర్కొన్నారు. శశికళ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే తాను రాజీనామా చేశానని.. తాను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని గవర్నర్ కు చెప్పినట్లుగా పేర్కొన్నారు.

అసెంబ్లీలో బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా వెల్లడించారు. పురట్చితలైవి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడు ఉంటాయన్న ఆయన.. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ తనకు మద్దతు నిలిచినందుకు ధన్యావాదాలు చెప్పారు. ధర్మమే గెలుస్తుందని చెప్పిన పన్నీర్.. ఈ సంక్షోభ సమయంలో తనకు అండగా ఉన్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో తాను శుభవార్త చెబుతానన్న మాటను చెప్పారు.  గవర్నర్ ను కలిసి వచ్చిన తర్వాత పన్నీర్ ముఖం వెలిగిపోవటం గమనార్హం. గవర్నర్ తో తానేం మాట్లాడానో చెప్పిన పన్నీర్.. అందుకు ఆయనేం రియాక్ట్ అయ్యారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. విలేకరులు ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయగా.. అందుకు అవకాశం ఇవ్వని ఆయన.. తన నివాసంలోకివెళ్లే సమయంలో మరోసారి నవ్వేశారు.

రెండు సందర్భాల్లో నవ్వేసిన పన్నీర్.. తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్న విషయాన్ని.. తానెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఇదిలా ఉండగా.. గవర్నర్ ను అన్నాడీఎంకే అధినేత్రి చిన్నమ్మ ఈ రాత్రి ఏడున్నర గంటల సమయంలో గవర్నర్ తో భేటీ కానున్నారు. ఈ ఇరువురి భేటీ అనంతరం గవర్నర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News