పన్నీర్ బ్యాచ్ మిస్ అయిన పాయింట్ ఇది..

Update: 2017-02-14 09:49 GMT
అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు వెంటనే.. శశికళ వర్గం నిరాశ..నిస్పృహల్లో కూరుకుపోతే.. పన్నీర్ సెల్వం వర్గం మాత్రం మిఠాయిలు పంచుకుంటూ.. బాణసంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంది. చూసేందుకు ఇదంతాబాగానే ఉన్నా.. అమ్మ వీరాభిమానులు కొందరు మాత్రం ఈ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిన్నమ్మ మీద ఉన్న కోపంతో సంబరాలు చేసుకుంటున్నారు కానీ.. అమ్మను కూడా కోర్టు దోషిగా తేల్చిందన్న విషయాన్నిపన్నీర్ బ్యాచ్ మిస్ అయిందన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పలువురు ప్రస్తావిస్తున్నారు. అమ్మకు వీర విధేయులైన వారు సుప్రీం తీర్పునకు బాధ పడాలే కానీ సంబరాలు చేసుకోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవంగా చూస్తే.. ఈ వాదనలో నిజం లేకపోలేదు. సుప్రీం తాజాగా వెలువరించిన తీర్పు అక్రమాస్తుల కేసులో చిన్నమ్మను మాత్రమే కాదు.. అమ్మను కూడా దోషిగా తేల్చారు. ఒకవేళ.. ఈ తీర్పు అమ్మ బతికి ఉన్నప్పుడు జరిగి ఉంటే.. ఇప్పుడు డ్యాన్సులు వేస్తున్నవారు.. సంబరాలు చేసుకుంటున్న వారు ఏం చేసేవారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

పన్నీర్ మీద అభిమానాన్ని తప్పు పట్టటం లేదు కానీ.. అమ్మ మీద ఉన్నఅభిమానం చిన్నమ్మ దెబ్బకు ఆవిరి అయిపోయిందా? లేక.. పన్నీర్ మీద పెంచుకున్న అభిమానంతో అమ్మ గురుతులు పాతబడిపోయాయా? అంటూ కొందరు వేస్తున్న ప్రశ్నలు విని.. టీవీ చూస్తే.. ఒక్క భావన మనసుకు కలగటం ఖాయం. ఈ దృశ్యాల్ని ఎక్కడి నుంచైనా చూసే అవకాశం అమ్మకు ఉంటే.. విపరీతంగా వేదన చెందుతారనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News