‘అమ్మ ఆత్మ’ తాజా పరిస్థితి చెప్పిన పన్నీర్

Update: 2017-02-16 12:46 GMT
కొన్నిమాటలు కొన్నిసార్లకు మాత్రమే బాగుంటాయి. అదే పనిగా చెబితే అస్సలు బాగోవు. ఈ విషయాన్ని పన్నీర్ సెల్వం అస్సలు గుర్తించటం లేదని చెప్పాలి. తొమ్మిది రోజుల క్రితం రాత్రివేళ అమ్మ సమాధి వద్దకు ఒంటరిగా వెళ్లి.. ధ్యానం చేసి.. అమ్మ ఆత్మ తనతో మాట్లాడిందని.. శశికళ చేసిన ద్రోహాన్ని అందరికి చెప్పాలంటూ అమ్మ ఆదేశించటంతో తాను నోరు విప్పుతున్నట్లు చెప్పి.. తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన పన్నీర్ మాటలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పటి నుంచి సమయం  చూసుకొని.. అమ్మ ఆత్మ గురించి పదే పదే మాట్లాడటం ద్వారా సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఇది పెద్దగా వర్క్ వుట్ కాలేదన్న విషయం గడిచిన తొమ్మిది రోజలుగా చోటు చేసుకున్న పరిణామాలు చెప్పకనే చెప్పేశాయి. అమ్మ ఆత్మ పన్నీర్ తో ఎంత మాట్లాడినా ఆయనతో కలిసి ముందుకు వెళ్లటానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవటం.. అందరూ కట్టకట్టుకొని రిసార్ట్స్ లోనే ఉండిపోవటంతో.. చివరకూ డీఎంకేశాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో పన్నీర్ బరస్ట్ అయ్యారు. అమ్మ ఆత్మ మాటను మరోసారి తెర మీదకు తీసుకొచ్చిన ఆయన.. ‘‘ఈ రోజు ఉదయం 11.30 గంటల నుంచి అమ్మ ఆత్మ క్షోభించటం మొదలైంది. అన్నాడీఎంకేని శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లనీయం’’అని చెప్పారు. అదేం చిత్రమో కానీ.. అమ్మ ఆత్మ పన్నీర్ తో తప్పించి.. మరెవరితోనూ మాట్లాడేలా లేదన్నట్లుగా కనిపించక మానదు. అమ్మ ఆత్మ మాటలు మొదట్లో కొత్తగా ఉండటంతో బాగున్నా.. పన్నీర్ అసలు బలం ఎంతో తేలిపోయిన తర్వాత ఇలాంటి మాటలు కామెడీగానే ఉంటాయని ఆయన గుర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News