జీన్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ కు వస్తే తిప్పి పంపుతున్నారు

Update: 2019-10-23 05:25 GMT
డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చే మహిళలు జీన్ ఫ్యాంట్ వేసుకుంటే కుదరదా? అదొక్కటే కాదు.. ఆ మాటకు వస్తే మగాళ్లు లుంగీలతో వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు నో అంటే నో అనేస్తూ తేల్చి చెబుతున్నారు చెన్నైలోని ఒక ఆర్టీవో కార్యాలయం. లైసెన్స్ కోసం వస్తే.. డ్రెస్ కోడ్ గురించి మాట్లాడతారేంటన్న విమర్శలు వినిపిస్తున్నా.. తాము అందరిని ఒకేలా చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

చెన్నై కేకే నగర్ లోని ఆర్టీవో కార్యాలయానికి ఒక మహిళ జీన్స్ ప్యాంట్.. స్లీవ్ లెస్ టాప్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు వచ్చారు. దీంతో.. ఆమెను కుదురైన బట్టలు వేసుకొని రావాలని.. అప్పుడు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కు అనుమతిస్తామని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.

మహిళలకే కాదు పురుషుల విషయంలోనూ కొన్ని డ్రెస్సుల్లో వచ్చిన వారికి లైసెన్స్ జారీ చేయకుండా తిప్పి పంపేయటం విశేషం. షార్ట్స్.. లుంగీలు కట్టుకొచ్చిన మగాళ్లకు లైసెన్స్ లు ఇచ్చేందుకు నో చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. సదరు ఆర్టీవో అధికారుల వెర్షన్ వేరేలా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలామంది తమ ఆపీసుకు వస్తారని.. అందరూ సరైన దుస్తులు ధరించాలని మాత్రమే కోరుతున్నాము తప్పించి మోరల్ పోలీసింగ్ చేయటం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగే కన్నా.. అలాంటివి జరగకుండా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవటంలో భాగంగానే తామీ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News