మోడీ ముందు చూపుతో పెరిగే చమురు పోటు ఉండదా?

Update: 2020-01-08 04:24 GMT
ఇరాన్ సైనిక బలగాల చీఫ్ ను ఇరాక్ లో అమెరికా హతమార్చటంతో చోటుచేసుకున్న పరిణామాలు అంతర్జాతీయంగా ఎంత సంచలనం గా మారిందో తెలిసిందే. అమెరికా చేసిన చర్యకు ప్రతీకార చర్య తప్పదంటూ ఇరాన్ హెచ్చరిస్తున్న వేళ.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా లో అయితే ఒక అడుగు ముందుకేసి.. మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా? అన్న వాదనలు జోరందుకున్నాయి.

ప్రపంచానికి యుద్ధం పొంచి ఉందన్న భావనలకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో ముడిచమురు ధరలు బ్యారెల్ కు 5 డాలర్లు పెరగటమే కాదు.. ఉద్రికత్తలు పెరిగే కొద్దీ ముడి చమురు ధరలు అంతకంతకూ పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చమురును అత్యధికంగా వినియోగిస్తూ.. వినియోగంలో 80 శాతానికి పైనే దిగుమతి చేసే దేశమైన భారత్ కు తాజా పరిణామాలు ఇబ్బంది కావటమే కాదు.. ఆర్థికంగా పెను భారమవుతుందన్న మాట వినిపిస్తోంది.

అయితే.. ఎవరూ ఊహించనిరీతిలో కొద్ది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యల పుణ్యమా అని భారత ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. గతానికి భిన్నంగా ఇప్పుడు రిజర్వు బ్యాంకు వద్ద భారీగా డాలర్ల నిల్వలు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ముడిచమురు ధరలు పెరిగినంతనే.. డాలర్ల ధరలు పెరుగుతాయి. అయితే.. గతంతో పోలిస్తే.. భారీగా డాలర్ల నిల్వలు పెద్ద ఎత్తున ఉండటంతో మరో పదినెలల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

ముడి చమురు బిల్లుల్ని అమెరికా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. మోడీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ ఎత్తున డాలర్లను పోగేసి ఉంచటంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి బయట పడే వీలుందని చెబుతున్నారు. మోడీ సర్కారు కొలువు తీరిన తర్వాత డాలర్లను పెద్ద ఎత్తున సమీకరించటం మొదలు పెట్టింది. దీంతో ఆసియాలోనే అత్యధిక డాలర్ల నిల్వలు మన దగ్గరే ఉండటం గమనార్హం.

గత డిసెంబరు 27 నాటికి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 457.5 బిలియన్ డాలర్ల కు చేరుకున్నాయి. ఆసియా లోని ఏ ఇతర దేశాల్లోని కేంద్ర బ్యాంకు వద్ద కూడా ఈ స్థాయి లో డాలర్ల నిల్వ లేక పోవటం గమనార్హం. 2019లో తైవాన్ 15 బిలియన్ డాలర్లు.. థాయి లాండ్ 14 బిలియన్ డాలర్ల చొప్పున కొంటే.. భారత్ మాత్రం ఏకంగా 64 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది. అదిప్పుడు వరంగా మారి.. పెరిగే ముడిచమురు ధరలు ప్రభుత్వం మీద వెంటనే పడే అవకాశం లేకుండా చేసింది. ఏమైనా మోడీ ముందుచూపును అభినందించాల్సిందే.




Tags:    

Similar News