12 వేల మంది యువ రైతుల‌కు 250 మంది అమ్మాయిల‌తో పెళ్లి చూపులు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే!

Update: 2022-11-15 05:41 GMT
దేశంలో పెళ్లిగాని ప్ర‌సాదుల సంఖ్య పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. అందునా.. రైతులు అంటే.. అస‌లు అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేసే కుటుంబాలు లేకుండా పోయాయి. ఇక‌, పౌరోహిత్యంలో ఉన్న యువ బ్రాహ్మ‌ణ కుర్రాళ్లు కూడా పెళ్లిళ్ల  కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు.. సామూహిక పెళ్లి చూపుల‌కు తెర‌దీస్తున్నాయి.

కొన్నాళ్ల కింద‌ట యూపీలో ఇలానే యువ బ్రాహ్మ‌ణ అవివాహితుల‌కు సామూహిక పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆస‌మ‌యంలో 2 వేల మంది అబ్బాయిలు వ‌స్తే.. ప‌ట్టుమ‌ని 100 మంది కూడా అమ్మాయిలు రాలేదు. వ‌చ్చిన‌వారిలో ఇద్ద‌రు ముగ్గురు మిన‌హా పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్ల‌లేదు.

ఇక‌, ఇప్పుడు తాజాగా క‌ర్ణాక‌ట‌లోని మండ్యలో నిర్వహించిన భారీ పెళ్లిచూపుల కార్యక్రమం.. యువ రైతులు పెళ్లి కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రస్తుత కాలంలో యువరైతులకు పెళ్లి కావాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తోంది. వధువుల తల్లిదండ్రులు రైతులకు తమ అమ్మాయిలను ఇచ్చి వివాహం చేసేందుకు ముందుకు రావడం లేదు. అలాంటి పరిస్థితిని నివారించేందుకు కర్ణాటక మండ్య జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్థులు.. వధూవరుల సమ్మేళనాన్ని నిర్వహించారు.

మండ్య జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు. ఈ పెళ్లిచూపుల సమ్నేళనానికి 250 మంది అమ్మాయిలు రాగా.. వారిని చూసుకోవడానికి 11,775 మంది యువకులు తరలివచ్చారు. వీరందరూ యువరైతులు, రైతు కుటుంబానికి చెందినవారే కావడం విశేషం.

ఒక్కలిగ సంఘం కన్వెన్షన్లో దాదాపు 12,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. పెళ్లిచూపులకు వచ్చిన యువకుల క్యూలైన్ చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే, పెళ్లి చూపులు బాగానే జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విందును కూడా అంద‌రూ బాగానే ఆర‌గించారు. చివ‌ర‌కు సంబంధాలు కుదుర్చుకున్న‌ది మాత్రం 12 మంది!! ఇదీ.. ప్ర‌స్తుత ట్రెండ్‌!!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News