మోడీ ‘రద్దు’కు ఆ సీఎం కౌంటర్ ఎటాక్!!

Update: 2016-11-16 03:41 GMT
దేశంలో మరే ముఖ్యమంత్రి తీసుకోని రీతిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పెద్దనోట్ రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయానికి తూట్లు పొడిచేలా ఆయన తాజా నిర్ణయం ఉండటం గమనార్హం. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల ఆట తగ్గించాలని.. దేశంలో చెలామణీ అవుతున్న బ్లాక్ మనీకి సింగిల్ స్ట్రోక్ తో చెక్ చెప్పాలన్న మోడీ నిర్ణయానికి కొంతమేర గండి కొట్టేలా ఆయన నిర్ణయం ఉండటం సంచలనంగా మారింది.

పెద్దనోట్ల రద్దుపై లోలోన ఉడికిపోతున్నా.. చాలామంది ముఖ్యమంత్రి కామ్ గా ఉంటున్నారు. అందుకు భిన్నంగా అఖిలేశ్ నిర్ణయం ఉండటం గమనార్హం. ఇంతకీ ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటంటే.. యూపీలోని భూముల రిజిస్ట్రేషన్లకు పాత రూ.500.. రూ.1000 నోట్లను తీసుకోవచ్చని ఆయన నిర్ణయించారు. దీంతో.. రాష్ట్రంలోని పాత పెద్దనోట్లు ఒక్కసారిగా చెలామణీలోకి వచ్చినట్లైంది.

ఈ నెల 24 వరకూ యూపీలోని భూముల రిజిస్ట్రేషన్లన్నీ పాత నోట్లతో జరుపుకునేందుకు అఖిలేశ్ సర్కారు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో బ్లాక్ మనీ తన రూపు మార్చుకొని విస్తృతంగా చేతులు మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. పెద్దనోట్ల రద్దుపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కుతకుతలాడిపోతున్న మిగిలిన రాష్ట్రాలు కూడా యూపీ ముఖ్యమంత్రిని ఫాలో అయిపోతే.. దేశంలో గందరగోళ వాతావరణం నెలకొనే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News