ఆ మాజీ సీఎంలు బంగళాలు ఖాళీ చేయాల్సి వచ్చింది

Update: 2019-10-29 08:22 GMT
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. వారెప్పుడూ ఊహించని విచిత్రమైన పరిస్థతుల్లో చిక్కుకున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజకీయాల్ని ఒంటిచేత్తో ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు ఒకేసారి షాక్ తగిలిన పరిస్థితి. ఇంతకూ వారెవరోకాదు.. ఒకరు మెహబూబా ముఫ్తీ అయితే.. మరోకొరు ఒమర్ అబ్దుల్లా. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి.

జమ్ముకశ్మీర్ రాష్ట్ర స్టేటస్ ను మారుస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో.. మాజీ ముఖ్యమంత్రులు తమ అధికారిక నివాసాల్నిఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల పెన్షన్ యాక్ట్ 1984ను 1996లో సవరించారు. ఆ చట్టం ప్రకారం ఎమ్మెల్యేలకు పలు ప్రయోజనాలు అందేవి.

జమ్ముకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో పాత విధానాలు రద్దు కానున్నాయి. దీంతో.. నవంబరు ఒకటో తేదీ నుంచి మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు తమ నివాసాల్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మరో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కూడా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే చోటు చేసుకున్న పరిణామాలతో రగిలిపోతున్న ఈ నేతలకు.. తాజా పరిస్థితి మరింత మింగుడుపడనిదిగా మారుతుందడనటంలో సందేహం లేదని చెప్పాలి.
Tags:    

Similar News