ఒమిక్రాన్ వేళ.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?

Update: 2021-12-24 04:39 GMT
ప్రపంచంలోని పలు దేశాల్ని ఇప్పటికే వణికించిన ఒమిక్రాన్ వేరియంట్.. తాజాగా దేశంలోనూ నెమ్మదిగా విస్తరిస్తోంది. ఇప్పటికి వెల్లడైన కేసులు పరిమితంగా ఉన్నప్పటికీ.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరితో కేసుల మరింతగా పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. మొన్నటి వరకు సింగిల్ డిజిట్ లో బయటకు వచ్చిన ఒమిక్రాన్ కేసులు.. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కళ్లు తెరిచిన కేంద్రం రాష్ట్రాలకు సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిర్వహించిన రివ్యూలో రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేశారు. కరోనా పరీక్షల్లో పాజిటివిటీ రేటు 10 శాతం మించినా.. స్థానిక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకల భర్తీ 40 శాతానికి సమీపించినా ప్రాంతాల వారీగా కట్టడి చర్యల్ని వెంటనే చేపట్టాలన్నారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉన్నందున.. దీని ముప్పు రాక ముందే ఆంక్షల్ని అమలు చేయాలన్నారు.

కంటైన్ మెంట్ జోన్లలో ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలని కోరారు. రాబోయే రోజుల్లో పండుగలు ఉన్నందున మరింత అప్రమత్తంగాఉండాలని కోరారు. అవసరమైతే క్రిస్మస్.. నూతన సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విధించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేశారు. అవేమంటే..

- భారీ సభలు.. సమూహాలను నియంత్రించాలి

- అనుమానాస్పద నమూనాల్ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్ లకు పంపాలి

- ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా రాత్రిళ్లు కర్ఫ్యూనను అమలు చేయాలి

- జిల్లాల వారీగా డెల్టా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి

- వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలి

- రాష్ట్రాల వారీగా వైరస్ పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తుండాలి. మాస్కులు.. భౌతికదూరం అంశాల్ని ప్రోత్సహించాలి

- పాజిటివిటీ రేటు.. డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి.

- త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వంద శాతం టీకా పంపిణీ పూర్తి అయ్యేలా చూడాలి

- కంటైన్ మెంట్ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి కరోనా బాధితులు ఎవరైనా ఉన్నారా? అన్న విషయాన్ని పరిశీలించాలి.

- అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్టీపీసీఆర్ పరీక్షను నిర్వహించాలి

- జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రాం చేపట్టాలి

- ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం.. అంబులెన్స్.. ఇతర సదుపాయాల్ని అందుబాటులో ఉంచుకోవాలి
Tags:    

Similar News