ఏపీ, తెలంగాణ పై ముసురుకుంటున్న 'ఒమిక్రాన్'

Update: 2021-12-28 00:31 GMT
తెలుగు రాష్ట్రాలపై కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' ముసురుకుంటోంది. తాజాగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ఏపీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో మరోసారి ఆంక్షలు, లాక్ డౌన్ దిశగా సాగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య సోమవారం ఒక్కరోజే పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఏకంగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కు పెరిగింది.

నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 10 మందిలో ఈ కొత్త వేరియంట్ వెలుగుచూడగా... మరో ఇద్దరు కాంటాక్టు వ్యక్తుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. ఒమిక్రాన్ బాధితుల్లో ఇప్పటివరకూ 10 మంది కోలుకున్నారు.

మరోవైపు రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 182 కోవిడ్ కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. 181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3417 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.90 శాతంగా ఉంది. మరణాల రేటు 0.59 శాతంగా ఉందని ప్రభుత్వం తాజాగా తెలిపింది.

-ఒమిక్రాన్ విషయంలో ఆందోళన వద్దన్న సీఎం జగన్

కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' కేసులు పెరుగుతుండడంతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేయాలన్న జగన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి టీకాలు వేయాలన్న సీఎం.. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు.  కేంద్రం బూస్టర్ డోస్ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలన్న సీఎం.. ఫిబ్రవరి నాటికి కొత్త నియామకాలు పూర్తి చేయాలన్నారు.
Tags:    

Similar News