మ‌రోసారి ఎన్‌ఐఏ, ఈడీ దాడుల్లో 105 మంది అరెస్టు.. ఇదీ నేప‌థ్యం!

Update: 2022-09-22 09:30 GMT
ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు, మ‌త విద్వేషాల‌కు ప్ర‌ణాళిక‌, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధుల త‌ర‌లింపు వ్య‌వ‌హారంలో కొద్ది రోజుల క్రితం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లో సోదాలు నిర్వ‌హించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలువురిని అరెస్టు చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ‌లోని నిజామాబాద్‌లో పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్య‌క‌ర్త‌లను అరెస్టు చేసింది.

ఈ క్ర‌మంలో తాజాగా మ‌రోమారు 13 రాష్ట్రాల్లో పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేత‌లు, కార్యాల‌యాల‌పై సుమారు 100 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. ఉగ్రవాద కార్య‌క‌లాపాలు, ఇందుకు నిధుల స‌మీక‌ర‌ణ వంటి వాటిపై జాతీయ దర్యాప్తు సంస్థ గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రాటే శిక్ష‌ణ‌, నైపుణ్య శిక్ష‌ణ పేరుతో ఉగ్రవాద‌ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రల్లో ఎన్ఐఏ తాజాగా దాడులు నిర్వ‌హించింది. సెప్టెంబ‌ర్ 21 అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహించగా.. సెప్టెంబ‌ర్ 22 ఉదయానికి 105 మందిని అరెస్ట్‌ చేసింది. ఎన్‌ఐఏతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), రాష్ట్రస్థాయి పోలీసు బృందాలు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, బిహార్‌, కేరళ  సహా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఈ దాడులు చేప‌ట్టింది. ఇప్పటి వరకు ఉగ్రవాద నిధుల సేకరణ, శిక్షణ క్యాంపుల నిర్వహణ, ప్రజల్లో మ‌త విద్వేషాలు ప్ర‌జ్వ‌రిల్లేలా చేయ‌డం వంటి అంశాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్‌ ప్రకారం.. యూఏఈ, ఒమన్‌, కతార్‌, కువైట్‌, సౌదీ అరేబియా త‌దిత‌ర ముస్లిం దేశాల‌ నుంచి నిధులు సేకరించేందుకు జిల్లాస్థాయి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను సైతం పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. హవాలా సహా ఇతర అక్రమ మార్గాల్లో నిధులను తరలించేందుకు వ్యక్తిగతంగా వారికి టార్గెట్లు సైతం ఇస్తున్నట్లు ఈడీ చెబుతోంది.

తాజా దాడుల్లో భాగంగా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు  దేశ‌వ్యాప్తంగా విరాళాలు అందించిన 600 మందికిపైగా బ్యాంకు ఖాతాలను ఈడీ తనిఖీ చేసింది. ఇందులో భాగంగా 2,600 మందికిపైగా లబ్ధిదారుల ఖాతాలను పరిశీలించింది. అందులో చాలా వరకు బోగస్‌ ఖాతాలేనని ఈడీ స్ప‌ష్టం చేయ‌డం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఖాతాల‌ ధ్రువీకరణ సమయంలో ఖాతాదారులు హాజరుకాలేదని ఈడీ వెల్ల‌డించింది.

రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 40 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న న‌లుగురు అనుమానిత వ్యక్తుల‌ను అరెస్ట్‌ చేసింది. వారి నుంచి ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు, ఉగ్ర‌వాద సాహిత్యం, ప‌లు డిజిటల్‌ పరికరాలు, పలు పత్రాలు, రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది.

ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక బృందం అన్షద్‌ బసేదీన్ అనే ఉగ్ర‌వాదిని అరెస్ట్‌ చేసింది. అతని వద్ద పేలుడు ప‌దార్థాలు, పిస్టళ్లు, తూటాలను స్వాధీనం చేసుకుంది. అతనికి పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రూ.3.5 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఉగ్రవాద కార్యకలాపాల్లో పీఎఫ్‌ఐ పాత్ర ఉంద‌ని ఈడీ చార్జిషీట్ న‌మోదు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News