తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజేనా?

Update: 2016-08-28 05:47 GMT
ప్రేమకైనా.. ద్వేషించేందుకైనా కేసీఆర్ తర్వాతే ఎవరైనా. నచ్చితే నెత్తిన పెట్టుకోవటం.. నచ్చకుంటే నేలకు పడేయటం ఆయనకు బాగా తెలుసు.  నచ్చటం.. నచ్చకపోవటం అంతా కాలం మీదనే ఆధారపడి ఉంటుందన్న సూత్రాన్ని బలంగా నమ్మే కేసీఆర్ కు శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. నిన్నటి వరకూ తిట్టేసిన వారితో ఆయన తర్వాతి రోజే ఫ్రెండ్ షిప్ చేయగలరు. తన మాటలతో గతంలో తానన్నవన్నీ మర్చిపోయేలా చేయగల సత్తా ఆయన సొంతం. అందుకు నిదర్శనంగా మోడీనే చెప్పుకోవాలి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో మరే అధినేత విమర్శించనంత ఘాటుగా మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు చేయటాన్ని మర్చిపోలేం. ఆ విషయాల్ని గుర్తు పెట్టుకునే మోడీ తెలంగాణ వైపు చూడలేదన్న మాట ఉంది. ఎక్కడెక్కడో ఉన్న విదేశాలకు వెళ్లే ప్రధాని.. ఢిల్లీకి 45 నిమిషాల విమాన ప్రయాణ దూరంలో ఉన్న తెలంగాణకు రావటానికి రెండున్నరేళ్లు పట్టటం వెనుక కేసీఆరే వ్యాఖ్యలే అని చెబుతారు. తన పని తీరుతో బలమైన నాయకుడిగా అవతరించిన మోడీతో గొడవ కంటే.. సఖ్యతగా ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ముఖ్యమని భావించిన కేసీఆర్ మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన విషయాల్ని మర్చిపోలేం.

మారిన కేసీఆర్ మాటల్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే మోడీ తెలంగాణలో అడుగుపెట్టినట్లుగా చెబుతారు. అందుకు తగ్గట్లే కేసీఆర్ ప్రసంగం ఉందని చెప్పొచ్చు. మిగిలిన రాష్ట్రాల మాదిరి తాము నిధుల కోసం ఒత్తిడి చేయమని.. తమకు మోడీ ప్రేమ ఉంటే సరిపోతుందంటూ తన మాటల చమత్కారంతో మోడీ మనసు దోచుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్.

కేవలం మాటలే కాదు.. తన అభిమానం చేతల్లో కూడా అని చేసి చూపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చటం ద్వారా.. మోడీతో స్నేహానికి తాను ఎంత విలువ ఇస్తున్నది చెప్పకనే చెప్పేస్తున్నారు కేసీఆర్. తొలుత వినిపించినట్లుగా కాకుండా.. తాజాగా నిర్వహించే తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఒక్కటంటే ఒక్కరోజుకే పరిమితం చేయనున్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 30 (మంగళవారం) కొలువు తీరే తెలంగాణ అసెంబ్లీలో జీఎస్టీ బిల్లును ఆమోదించి.. సభను ముగిస్తారన్న మాట వినిపిస్తోంది. అయితే..దీన్ని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్ని కొనసాగించాలని.. జీఎస్టీతో పాటు.. మరికొన్నిఅంశాల్ని చర్చకు తేవాలని పట్టుబడుతున్నాయి. అయితే.. తెలంగాణ అధికారపక్షం మాత్రం ప్రస్తుత సమావేశాన్ని జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేయటానికి మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నారు. జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర వేసి పంపాక.. గణేశ్ ఉత్సావాలు పూర్తి అయ్యాక సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించాలని భావిస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసమే తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా కొలువు తీర్చటం ద్వారా.. మోడీ ప్రేమను పొందేందుకు తామెంత అర్హులమన్న విషయాన్ని ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతలతో చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.
Tags:    

Similar News