ల‌క్ష ఐటీ ఉద్యోగాల లెక్క తేల‌ట్లేదు లోకేశ్‌

Update: 2017-07-11 05:22 GMT
అస‌లే చిన‌బాబు మాట‌ల మీద చాలామందికి చాలానే సందేహాలు ఉన్నాయి. రాజ‌కీయాల‌కు కొత్త కాకున్నా.. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి కొత్త అయిన నేప‌థ్యంలో మాట‌ల్లో ఆ మాత్రం త‌డ‌బాటు మామూలే. అంత మాత్రం దానికి గుడ్డు మీద ఈక‌లు పీకిన‌ట్లుగా.. లోకేశ్ బాబు చెప్పిన ప్ర‌తి మాట‌ను త‌ర్కంగా చూస్తే ఎలా అంటూ ఫీలైపోతుంటారు తెలుగు త‌మ్ముళ్లు. స్వాతంత్ర‌దినోత్స‌వం మొద‌లు అంబేడ్క‌ర్ జ‌యంతి వ‌ర‌కూ చిన్న చిన్న మిస్టేక్స్ తో మాట్లాడితే ఆగ‌మాగం చేసేయ‌టం బాగోదట‌.

చంద్ర‌బాబు లాంటి మ‌హానేత కుమారుడు.. చిన్న వ‌య‌సులోనే తండ్రికి ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి తీసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చిన లోకేశ్ లాంటి బుద్ధికుశ‌ల‌త ఉన్న వ్య‌క్తి మాట‌ల్లో త‌ప్పులు దొర్లితే చూసీచూడ‌న‌ట్లుగా ఉండిపోవాలే కానీ ఎత్తి చూపించ‌టాన్ని ఏ మాత్రం స‌హించ‌లేక‌పోతున్నారు తెలుగు త‌మ్ముళ్లు. నిజ‌మే.. అధినాయ‌క‌త్వం మీద ఆ మాత్రం విధేయ‌త ప్ర‌ద‌ర్శించ‌క‌పోతే ఏం బాగుంటుంది చెప్పండి.

చిన‌బాబు మాట్లాడే ప్ర‌తి మాట‌ను జాగ్ర‌త్త‌గా చూస్తారే కానీ.. అంత బిజీలోనూ ఆ మాత్రమైనా మాట్లాడుతున్నార‌ని ఎందుకు అర్థం చేసుకోరు? నిన్న‌టికి నిన్న‌టి ముచ్చ‌టే చూస్తే.. విజ‌య‌వాడ‌లో ఐటీ కంపెనీలు స్టార్ట్ చేసిన సంద‌ర్భంగా మ‌హా ఆనందంగా క‌నిపించారు చిన‌బాబు.  అదేంటి.. బెజ‌వాడ‌కు వ‌స్తున్నవ‌న్నీ చిన్న చిన్న కంపెనీలేనా?.. పెద్ద‌వి రావా? అని ఒక జ‌ర్న‌లిస్ట్ అడిగితే ఎకో సిస్టం డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లుగా చెప్పారు లోకేశ్ బాబు. అంతేనా.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అని.. ఆ వెంట‌నే స‌ర్దుకొని మూడేళ్లు అని చిన‌బాబే స‌ర్ది చెప్పేశారు. ఇలాంటి పొర‌పాట్ల‌ను మ‌రీ భూత‌ద్దంలో పెట్టి చూడ‌కూడ‌దు. ఎందుకంటే.. బిజీ షెడ్యూల్‌.. వ‌య‌సుకు మించి బాధ్య‌త‌లు బ‌రువులు మోసే వేళ‌.. ఇలాంటి మాట‌లు కామ‌న్ అని అనుకోవాలే కానీ.. త‌ప్పులు ఎత్తి చూపించ‌టం ఏ మాత్రం స‌రి కాదు.

నిజానికి ఇలాంటి వాటికి అన‌వ‌స‌ర ప్రాధాన్య‌త ఇస్తారు కానీ.. చిన‌బాబు చెప్పే లెక్క‌ల ముచ్చ‌ట‌లోకి అస్స‌లు వెళ్ల‌రు. ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ మీడియా ద‌గ్గ‌ర 2019 నాటికి ల‌క్ష ఉద్యోగాలు అంటూ చెప్పి ఏపీ యూత్‌ ను తెగ ఊరించేస్తున్నారు. రెండున్న‌ర సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ల‌చ్చ ఊద్యోగాలంటే మాట‌లా?  అంత ఘ‌నత‌ను సాధించాల‌ని భావిస్తున్న చిన‌బాబును ప్ర‌శంస‌ల్లో ముంచెత్తాల్సిందే.

రెండున్న‌రేళ్ల‌లో ల‌చ్చ ఉద్యోగాల్ని తీసుకొచ్చే ల‌క్ష్యంతో చిన‌బాబు చేస్తున్న ప‌నిని చూసి తెగ మురిసిపోవాల్సిందే త‌ప్ప‌.. హైద‌రాబాద్ కు మించినట్లుగా ఐటీని డెవ‌ల‌ప్ చేస్తాన‌న్న మాట‌ల‌కు.. ల‌చ్చ ఉద్యోగాల‌కు సింక్ కావ‌ట్లేద‌న్న విష‌యాన్ని లైట్ తీసుకోవాల్సిందే.

ఆ మాట‌కు వ‌స్తే.. 2019 నాటి ల‌చ్చ ఉద్యోగాల లెక్క విష‌యంలోనూ విప‌రీత‌మైన క‌న్ఫ్యూజ‌న్‌. ఎంత లెక్క‌లేసుకున్నా.. ల‌చ్చ‌కు చానా దూరంగానే ఆగిపోతున్న విష‌యాన్ని చూసిన‌ప్పుడు.. చిన‌బాబుకు ఈ లెక్క చెప్పిన పెద్ద మ‌నిషి గురించి తెలుసుకోవాల‌నిపించ‌క మాన‌దు.

ఎందుకంటారా? గ‌డిచిన మూడు నెల‌ల్లో చిన‌బాబు 3 వేల ఐటీ ఉద్యోగాల్ని ఏపీకి తీసుకొచ్చిన‌ట్లుగా చెప్పారు. అంటే నెల‌కు వెయ్యి ఉద్యోగాలు. ఈ లెక్క‌న రానున్న ఐదు నెలల్లో మ‌రో 5 వేల ఉద్యోగాలు. మొత్తంగా 2017 పూర్తి అయ్యే నాటికి 8 వేల ఉద్యోగాలు వ‌చ్చిన‌ట్లు. నెల‌కు వెయ్యి చొప్పున లెక్క వేస్తే 2018 ఏడాదికి ఒక ప‌న్నెండువేల ఉద్యోగాలు.. 2019 ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలోనూ మ‌రో  12 వేల ఉద్యోగాలు మాత్ర‌మే వ‌స్తాయి. అంటే.. రెండేళ్ల‌కు 24 వేలు.. ఈ ఏడాదికి వ‌చ్చే 8 వేల ఉద్యోగాల లెక్క చూస్తే.. మొత్తంగా 32 వేల ఉద్యోగాల‌కు మించ‌వు.

ఈ లెక్క బాగోలేదంటే..చిన‌బాబు చెప్పిన మ‌రో లెక్క‌లోకి వెళ‌దాం.

గ‌డిచిన మూడు నెల‌ల్లో 3 వేల ఉద్యోగాలు వ‌చ్చాయి.. రానున్న రెండు నెల‌ల్లో 10 నుంచి 15 వేల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు. కాక‌పోతే 10 నుంచి 15 వేల మ‌ధ్య గ్యాప్ 5 వేలు ఉంది. ఏదో.. వందో.. రెండంద‌లో అంటే స‌ర్దుకోవ‌చ్చు. ఏకంగా ఐదు వేల ఉద్యోగాలంటే మాట‌లు కాదుగా. అయినా.. చిన‌బాబు బిజీ షెడ్యూల్‌ ను దృష్టిలో పెట్టుకొని.. ఆయ‌న మాట‌ల్ని అర్థం చేసుకొని మ‌న‌మే లెక్క‌ను స‌ర్దుబాటు చేసుకొని చూస్తే.. రానున్న రెండునెల‌ల్లో 12 వేల ఉద్యోగాలుగా భావిద్దాం. అంటే.. తొమ్మిదో నెల పూర్తి అయ్యేస‌రికి 12వేలు కొత్త‌వి.. పాత‌వి 3 వేలు. అంటే.. 15 వేలు. ఈ లెక్క‌కు స‌రాస‌రి చేస్తే నెల‌కు 3 వేల చొప్పున ఉద్యోగాలు వ‌స్తాయ‌నుకుంటే.. ఈ ఏడాది పూర్తి అయ్యేస‌రికి మొత్తంగా 24 వేల ఉద్యోగాల వ‌ర‌కు వ‌చ్చే వీలుంది.

ఇదే లెక్క‌న రానున్న రెండేళ్ల‌లో 24వేల చొప్పున లెక్క వేస్తే.. మొత్తంగా 72 వేల ఉద్యోగాలు మాత్ర‌మే లెక్క తేలుతాయి. మ‌రి.. ల‌చ్చ‌కు మ‌రో 28 వేల ఉద్యోగాలు దూరంలో ఉండేలా చిన‌బాబు లెక్క ఎలా చెప్పిన‌ట్లు?
ఇంత వివ‌రంగా చిన‌బాబు ప్ర‌తిసారీ లెక్క‌వేసుకునే తీరిక ఉండ‌క‌పోవ‌చ్చు. క‌నీసం.. ఆయ‌న ప‌క్క‌న ఉండేవాళ్లు.. లెక్క‌ల స‌ల‌హాలు ఇచ్చే వారైనా స‌రే.. కాస్త వ‌ర్క్ వుట్ చేసి.. చిన‌బాబుకు లెక్క చెబితే.. ఆయ‌న చెప్పేస్తారు క‌దా? అంత చిన్న దానికి చిన‌బాబును ఎందుకు చిరాకు పుట్టించేలా చేస్తారు?
Tags:    

Similar News