ఒకరి నిర్లక్ష్యం వల్ల 100 మందికి కరోనా ... ?

Update: 2020-03-27 13:30 GMT
కరోనా వైరస్సోకి మార్చి-18,2020 న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 15 గ్రామాలలో పర్యటించి, 100మందిని కలిసినట్లు తేలింది. అయితే ఇప్పుడు ఆయన కలిసిన 100మందిలో ఉన్న 23మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 33 కేసులు నమోదు కాగా అత్యధిక మందికి సదరు వ్యక్తి ద్వారానే ఈ మహమ్మారి సోకింది.

దీనితో ఇప్పుడు ఆయన పర్యటించిన పంజాబ్ లోని 15 గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో అధికారులు 15 గ్రామాలకు సీల్ వేశారు. మరణించిన 70 ఏళ్ల వృద్ధుడు గురుద్వార మతపెద్దగా వ్యవహరించేవారు. ఆయన తన ఇద్దరు సన్నిహితులతో కలిసి కొన్ని రోజుల క్రితం జర్మనీ, ఇటలీ పర్యటనకు వెళ్లారు. రెండు వారాలు అక్కడే ఉండి.. మార్చి 6న స్వస్థలానికి వచ్చారు. అనంతరం మార్చి 8-10 వరకు ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు 15 గ్రామాల్లో పర్యటించి వంద మందిని కలిశారు.

ఆ తర్వాత ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. హాస్పిటల్ లో చేరారు. అయితే, మార్చి 18న కరోనా తీవ్రతరమవడం తో ఆయన మృతి చెందారు. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యుల్లో దాదాపు 14 మందికి కరోనా అంటుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సదరు వృద్ధుడిని కలిసిన వారందరి వద్దకు వెళ్లి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. 15 గ్రామాల వ్యక్తులు విధిగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా నవన్షార్‌, మొహాలీ, అమృత్‌సర్‌, హోషియాపూర్‌, జలంధర్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాగా భారత్‌లో ఇప్పటివరకు 761 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 20 మంది మృత్యువాతపడ్డారు.
Tags:    

Similar News