కోడెల ఫ్యామిలీ.. మరో కుట్ర బయటపడిందా!

Update: 2019-07-07 05:13 GMT
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల కుటుంబ సభ్యులు సాగించిన దందాల మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదు అయ్యాయి.  తమను బెదిరించి కోడెల కుటుంబం వసూళ్లు చేసిందని అనేక మంది పోలిస్ స్టేషన్లకు చేరారు. వారంతా ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు కోడెల కూతురు - కొడుకుపై కేసులు నమోదు అయ్యాయి.  అలాగే కోడెల శివప్రసాద్ రావు మీద కూడా బెదిరింపుల కేసు ఒకటి నమోదు అయ్యింది.

ఇక ఇంతలోనే మరో వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రులకు దూదిని - ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ ను సరఫరా చేసే వ్యవహారంలో కూడా కోడెల కుటుంబం ఒక భారీ స్కామ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కు నాసిరకం దూది - ఇతర మెడికల్ సామాగ్రిని కోడెల కుటుంబం సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ స్కామ్ లో పెద్ద వ్యూహమే ఉందట. ప్రభుత్వం నుంచి సరఫరా కాంట్రాక్టును కోడెల కుటుంబం పొందింది. తమకు ఒక కంపెనీ ఉందని - దాన్నుంచి సరఫరా చేస్తామంటూ ప్రభుత్వానికి భారీ ధరకు సరకును సరఫరా చేసే కాంట్రాక్టు పొందిందట. అయితే వారికి అందుకు సంబంధించిన కంపెనీ ఏదీ లేదని తెలుస్తోంది.

తమిళనాడు నుంచి నాసిరకం సామాగ్రిని దించి - వాటికి వీరి కంపెనీ పేరుతో ఒక లేబుల్ అతికించి వాటినే ప్రభుత్వ ఆసుపత్రులకు పంపినట్టుగా తెలుస్తోంది. నాసిరకం ఉత్పత్తులకు ఒక నకిలీ కంపెనీ స్టిక్కర్లను అతికించి ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలను దోచేసిందట కోడెల కుటుంబం. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో కోడెల కుటుంబం అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News