కోడెల కుమారుడి మరో లీల..! కేసు నమోదు

Update: 2019-06-15 09:16 GMT
కే ట్యాక్స్ పేరిట మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఫ్యామిలీ పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తాజాగా కోడెల కుమారుడు శివరామ్ పై మరో మోసం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆంధ్రా రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు వద్ద 15 లక్షలు తీసుకొని కోడెల కుమారుడు మోసం చేశాడని శుక్రవారం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు అందింది. క్రికెటర్ నాగరాజు స్వయంగా ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట  గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరుఫున ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇతడు రెండేళ్ల క్రితం విజయవాడకు చెందిన భరత్ చంద్ర ద్వారా కోడెల కుమారుడిని కలిశాడట. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగం ఇప్పించాలని కోడెల శివరామ్ ను కోరాడు. అయితే దాన్ని అవకాశం తీసుకున్న శివరామ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలెట్ (ఏఎల్ పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్టు బాధితుడైన నాగరాజు తెలిపారు. దీంతో తాను ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లి రూ.15లక్షలను ఇచ్చానని నాగరాజు తెలిపాడు.  అప్పుడే ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి కాన్పూర్ వెళ్లి జాయిన్ కావాలని శివరామ్ కోరాడని నాగరాజు వివరించారు.

తాను కోడెల కుమారుడు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలతో  తెల్లవారి కాన్పూర్ వెళ్లానని.. అక్కడ కోడెల శివరామ్ కు చెందిన ఓ వ్యక్తి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీకి సమయం ఉందని తర్వాత తనకు కబురు చేస్తానని పంపించాడని నాగరాజు తెలిపారు. అప్పటి నుంచి కోడెల కుమారుడు చుట్టు తిరుగుతున్నా తనకు ఉద్యోగం ఇప్పించడంలేదని తెలిపారు.

మే 23 తర్వాత కోడెల ఫ్యామిలీ మోసాలపై పోలీసులు స్పందించి కేసులు నమోదు చేయడం.. ఆరోపణలు వెల్లువెత్తడంతో తాను ఈ విషయాన్ని కోడెల శివప్రసాద్ రావుకు ఫోన్ చేసి విషయం చెప్పానని.. డబ్బులు సెటిల్ చేసుకుందామని పిలిపిస్తే ఇంటికి వెళ్లానని నాగరాజు వివరించారు. అక్కడ కోడెల అనుచరులు తన దగ్గర  ఆధారంగా ఉన్న బాండ్ పేపరును చింపేశారని నాగరాజు ఆరోపించాడు.  ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే డబ్బులు ఇస్తానని చెబుతూ తప్పించుకుంటున్నారని వాపోయాడు. చివరకు గుంటూరు కు వచ్చి కోడెలకు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. దీంతో విసిగి వేసారి జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు నాగరాజు వివరించారు. దీంతో ఇప్పుడు కోడెల కుమారుడు శివరామ్ పై పోలీసులు నాగరాజు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు.

    

Tags:    

Similar News