డాక్టర్ లీ మాదిరే లేడీ డాక్టర్ మిస్సింగ్.. చైనా చంపేసిందా?

Update: 2020-03-31 03:30 GMT
ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా మహమ్మారి... చైనా నగరం వూహాన్ లో పుట్టిన విషయం తెలిసిందే. వూహాన్ నుంచే ప్రస్థానం ప్రారంభించిన ఈ వైరస్ గురించి తొలుత నోరిప్పిన డాక్టర్ లీ వెన్ లింగ్ పై  చైనా ప్రభుత్వం కఠిన చర్యలే తీసుకుంది. కరోనా గురించి బయటకు చెప్పడం, జాగ్రత్త వహించాలని అధికారులకు సలహా ఇవ్వడమే డాక్టర్ లీ చేసిన పాపంగా పరిగణించిన చైనా... ఆయనను విధుల నుంచి తప్పించేసి... కొంత కాలం పాటు కనిపించకుండా చేసింది. ఆ తర్వాత కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే ఆయన మరణించారు. ఈ ఘటనను మరువక ముందు చైనా పాల్పడిన మరో దురాగతం ఇప్పుడు బయటకు వచ్చింది. వూహాన్ సెంట్రల్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తున్న మహిళా వైద్యురాలు అయి ఫెన్ ఇప్పుడు కనిపించకుండా పోయారు.

అయినా డాక్టర్ అయి ఫెన్ చేసిన తప్పేంటంటే... కరోనా వైరస్ పై చైనా మీడియాకు తొలి ఇంటర్వ్యూ ఇవ్వడమేనట. కరోనా వైరఃస్ గురించి చైనాకు చెందిన ఓ మీడియా సంస్థకు మార్చి 14న డాక్టర్ అయి ఫెన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కరోనా వైరస్ గురించి ఆమె చాలా విషయాలే చెప్పారు. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు కూడా చెప్పారు. అంతేకాకండా ఈ వైరస్ ను తాను డిసెంబర్ 30ననే గుర్తించానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ అలా పబ్లిష్ అయ్యిందో, లేదో.. డాక్టర్ అయి ఫెన్ పై చైనా ప్రభుత్వ ఆదేశాల తో వూహాన్ సెంట్రల్ హాస్పిటల్ క్రమ శిక్షణా చర్యలకు దిగింది. అనుమతి లేకుండా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారన్న సాకును చూపి ఏకంగా ఆమెను విధుల నుంచి తప్పించేసింది.

సరే సస్పెన్షన్ తో సరిపెట్టేసిన చైనా సర్కారు డాక్టర్ అయి ఫెన్ ను లీ వెన్ లింగ్ మాదిరిగా శిక్షించలేదులే అని అంతా అనుకుంటున్న వేళ.... తాజాగా ఆమె విషయంలో సంచలన విషయం వెల్లడైంది. ప్రస్తుతం డాక్టర్ అయి ఫెన్ ఎక్కడున్నారో తెలియదట. అంటే... లీ వెన్ లింగ్ మాదిరే ఇప్పుడు డాక్టర్ అయి ఫెన్ కూడా మిస్సింగ్ జాబితాలో చేరిపోయారన్న మాట. మరి లీ వెన్ లింగ్ మాదిరే ఇప్పటికే డాక్టర్ అయి ఫెన్ ప్రాణాలు కోల్పోయారో? లేదంటే చైనా కర్కశత్వం తో ఇంకెంత బాధలు పడుతున్నారోనన్న వాదనలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. లక్షలాది మందికి సోకి... వేలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ గురించి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడమే పాపమైనట్లు ఇప్పుడు డాక్టర్ అయి ఫెన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్న విషయంపై అన్ని వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా లీ వెన్ లింగ్ విషయంలో తన దుర్మార్గాన్ని బయటపెట్టుకున్న చైనా... ఇప్పుడు డాక్టర్ అయి ఫెన్ విషయంలో తనలోని మరింత కర్కశత్వాన్ని బయటపెట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News