తూర్పులో టీడీపీకి మ‌రో వికెట్ ప‌డిన‌ట్టేనా?

Update: 2019-02-18 11:06 GMT
ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొచ్చేదాకా తీరిక‌గా వ్య‌వ‌హారం న‌డిపిన విప‌క్ష వైసీపీ... ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న‌గానే త‌న‌దైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు తిన్న వైసీపీ... పార్టీ నుంచి ఒక్కొక్క‌రుగా వెళ్లిపోవ‌డంతో పాటు వైరి వ‌ర్గంలో చేరుతున్నా కూడా చూస్తూ ఉండిపోయిన వైసీపీ ఇప్పుడు చ‌క్రం తిప్ప‌డం మొద‌లెట్టింది. త‌నదైన వ్యూహాల‌ను బ‌య‌ట‌కు తీసిన వైసీపీ... ఏకంగా అధికార పార్టీకి చుక్క‌లు చూపుతోంద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీలు, ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను చేర్చేసుకుని టీడీపీకి పెద్ద దెబ్బే కొట్టిన వైసీపీ... ఈ త‌ర‌హా వ్యూహాన్ని మ‌రింత‌గా ముందుకు తీసుకెళ్ల‌డం ద్వారా ఎన్నిక‌ల‌కు ముందుగానే టీడీపీకి ఓట‌మిని చ‌విచూపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే టీడీపీకే కాకుండా అధికారం ద‌క్కాలంటే ప్ర‌తి పార్టీకి కీల‌కంగా మారిన జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో క్ర‌మంగా బ‌ల‌ప‌డే దిశ‌గా వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. నేటి ఉద‌యం ఇదే జిల్లాకు చెందిన అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. ఈ నేప‌థ్యంలో ఈ జిల్లాకు చెందిన మ‌రింత మంది టీడీపీ నేత‌ల‌ను లాగేయ‌డం ద్వారా అధికార పార్టీని డైల‌మాలో ప‌డేయాల‌ని వైసీపీ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. జిల్లాలోనే కాకుండా ఇటు టీడీపీలోనూ కీల‌క నేత‌గా ఎదిగిన ఈ నేత‌... వైసీపీలో చేరేందుకు కూడా దాదాపుగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. అయితే ఆయ‌న పెట్టిన ఓ కండీష‌న్, దానిపై వైసీపీ పున‌రాలోచ‌న కార‌ణంగానే ఆయ‌న చేరిక ఆల‌స్యమైన‌ట్లుగా స‌మాచారం.

అయినా స‌ద‌రు నేత పెట్టిన కండీష‌న్ ఏమిటంటే... వైసీపీలోకి వ‌చ్చేందుకు త‌న‌కేమీ ఇబ్బంది లేద‌ని, అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌తో పాటు త‌న కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న ఓ కొత్త ప్ర‌తిపాద‌న పెట్టార‌ట‌. ఆల్రెడీ ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉన్న మీ వ‌ర‌కు టికెట్ ఇచ్చే విష‌యంలో ఎలాంటి ఇబ్బంది లేద‌ని, ప్ర‌స్తుతం ఆశావ‌హుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేప‌థ్యంలో రెండు టికెట్లు అంటే క‌ష్ట‌మేన‌ని కూడా వైసీపీ దాదాపుగా తేల్చి చెప్పింద‌ట‌. అయితే ఈ మాట‌తో స‌ద‌రు నేత పెద్ద‌గా నిరాశ చెంద‌లేద‌ని, ఇంకా వైసీపీ నేత‌ల‌తో ట‌చ్ లోనే ఉన్నార‌ని స‌మాచారం. సింగిల్ సీటుకు ఆయ‌న‌ను ఒప్పించేందుకు కూడా వైసీపీ త‌న‌దైన మంత్రాంగాన్ని కూడా నెర‌పుతోంద‌ట‌. ఈ మంత్రాంగం ఫ‌లిస్తే మాత్రం... తూర్పుగోదావ‌రి జిల్లాలో టీడీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News