రాహుల్ ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ ఓ ప్ల‌స్ ఓ మైన‌స్‌

Update: 2022-05-08 03:29 GMT
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల తెలంగాణ టూర్ విజ‌య‌వంతంగా ముగిసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌ర్వం తానై న‌డిపించిన వరంగల్ సభలో రాహుల్ ప్రసంగం నుంచి మొద‌లు మీడియా సంస్థ‌ల అధిప‌తుల‌తో స‌మావేశం వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీలో గుబులు రేకెత్తించేలా రేవంత్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలు ఆ పార్టీ నేత‌ల కామెంట్ల‌కు రేవంత్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇలా స‌ర్వం తానై వ్య‌వ‌హ‌రించిన రేవంత్ మ‌రో కీల‌క అంశంలో విఫ‌లం అయితే, ఇంకో అంశంలో విజ‌యం సాధించార‌ని అంటున్నారు.

రాహుల్ గాంధీ టూర్ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సార‌థ్యంలోని తెలంగాణ జ‌న స‌మితి పార్టీని విలీనం చేయించాల‌ని రేవంత్ రెడ్డి ఎత్తుగ‌డ వేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఈ ప్ర‌య‌త్నం విజ‌యవంతం కాలేదు. అయితే, ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ లో మరో పార్టీ విలీనం అయ్యేందుకు సిద్దం అయింది. టీఆర్ఎస్ పార్టీ మాజీ నేత‌, తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ త‌న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు స‌ముఖత వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో జరిగిన చర్చల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఢిల్లీలో తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌నున్నారు.


కాగా, పార్టీ విష‌యంలో వివిధ ర‌కాలైన అభిప్రాయాల‌కు తావు లేకుండా చూసేలా రేవంత్ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయింద‌ని అంటున్నారు. రైతు సంఘ‌ర్షణ స‌భ‌లో పార్టీ విధానాల‌పై, పొత్తుల‌పై, టికెట్ల కేటాయింపు అంశాల‌పై రాహుల్ స్పష్టమైన వైఖ‌రిని వెల్లడించడం వెనుక రేవంత్ వ్యూహం ఉంద‌ని చెప్తున్నారు. టికెట్ల విష‌యంలో సీనియారిటీని ప‌ట్టించుకోబోమ‌ని, జ‌నంలో ఉండే నాయ‌కుల‌కే పార్టీ మ‌ద్దతు ఉంటుంద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టేలా రాహుల్ చెప్ప‌డం వెనుక రేవంత్ వ్యూహం కొట్టిపారేయ‌లేనిద‌ని వివ‌రిస్తున్నారు. అలాగే పార్టీ ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాల‌నేది ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందే వెల్లడిస్తామ‌ని స్పష్టం చేయ‌డం ద్వారా పార్టీ ముఖ్యుల‌కు చెందిన నిర్ణ‌యాల‌కే ప్రాధాన్య‌మ‌నే మాట రాహుల్ తో చెప్పించిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News