కోట్ల రాక కేఈకి మింగుడు ప‌డ‌ట్లేదా?

Update: 2019-02-05 07:54 GMT
ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ప‌లువురు నేత‌లు పార్టీలు మారుతున్నారు. టికెట్లు ఖ‌రారు చేసుకుంటున్నారు. గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీలు అన్వేషిస్తున్నాయి. విజ‌యం సాధిస్తార‌ని భావిస్తున్న నేత‌ల‌ను చేర్చుకుంటున్నాయి. దీంతో కొన్ని పార్టీల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఒకే గూటికి చేరుతున్నారు.

క‌ర్నూలులోనూ ఇలాంటి ప‌రిణామ‌మే చోటుచేసుకుంటోంది. కోట్ల సూర్యప్ర‌కాశ్ రెడ్డి టీడీపీలో చేరుతుండ‌టంతో.. ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న కోట్ల కుటుంబం, కేఈ కుటుంబం ఒకే గూటికి చేరిన‌ట్ల‌వుతోంది. టీడీపీలోకి రాక‌తో కోట్ల కుటుంబం హ్యాపీగానే ఉన్న‌ప్ప‌టికీ.. కేఈకి మాత్రం ఈ ప‌రిణామం ఏమాత్రం మింగుడుప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. కోట్ల‌పై చంద్ర‌బాబు ఆస‌క్తి ప‌ట్ల ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

కోట్ల రాక కేఈకి మింగుడుప‌డ‌క‌పోవ‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వ‌స్తే క‌ర్నూలులో కేఈ కుటుంబం ప్రాధాన్య‌త త‌గ్గిపోయే అవకాశాలు బ‌లంగా ఉండ‌టం అందులో ప్ర‌ధాన‌మైన‌ది. కేఈ కృష్ణ‌మూర్తి డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుతో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు పెద్ద‌గా లేవు. కేఈ నిర్వ‌హిస్తున్న రెవెన్యూ మంత్రిత్వ‌శాఖ‌పై చంద్ర‌బాబుదే పూర్తి పెత్త‌నం. కీల‌క‌మైన రెవెన్యూశాఖ చేతిలో ఉన్న‌ప్ప‌టికీ అమ‌రావ‌తి నిర్మాణ వ్య‌వ‌హారాల్లో కేఈ జోక్యం దాదాపు శూన్యం. ఆ శాఖ‌లో నియామ‌కాల బాధ్య‌త‌ల‌ను కేఈకి చెప్ప‌కుండా చంద్ర‌బాబే చూసుకుంటున్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య దూరం పెరిగిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబుతో కేఈ కృష్ణ‌మూర్తి భేటీ కానుండ‌టం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. కోట్ల చేరిక అనంత‌రం టీడీపీలో త‌మ ఫ్యామిలీ భ‌విష్య‌త్తుపై  చ‌ర్చించేందుకే సీఎంతో ఆయ‌న భేటీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి కేఈ కృష్ణ‌మూర్తి, ఆయ‌న సోద‌రులు కేఈ ప్ర‌భాక‌ర్‌, ప్ర‌తాప్‌, ఉమారుడు శ్యామ్ చంద్ర‌బాబుతో కొన్నాళ్ల  క్రిత‌మే స‌మావేశ‌మ‌య్యారు. కోట్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే - ఆ మాట‌లు కేవ‌లం పైకి చెప్పిన‌వేన‌ని.. కోట్ల రాక‌పై కేఈ తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

క‌ర్నూలు ఎంపీ సీటును కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి, నంద్యాల ఎంపీ టికెట్ ను ఆయ‌న భార్య‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ పైనా కేఈ అసంతృప్తితో ఉన్నార‌ట‌. జిల్లాలో ఉన్న‌ రెండు  ఎంపీ సీట్లూ ఒకే కుటుంబానికి కేటాయిస్తే ఎలా అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. ఈ విషయంపై కూడా సీఎంతో భేటీలో కేఈ చ‌ర్చిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు - ప్ర‌స్తుతం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌త్తికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు శ్యాంను బ‌రిలో దించే అంశంపై కూడా చంద్ర‌బాబు మాట్లాడ‌తార‌ని స‌మాచారం.
Tags:    

Similar News