ఏడాదిలో 5 ల‌క్ష‌ల ప్రాణాలు తీసిన వంటిల్లు

Update: 2017-10-31 23:30 GMT
ఆ కాలుష్యం.. ఈ కాలుష్యం అంటూ అనే వారంద‌రూ చ‌ద‌వాల్సిన వార్త ఇది. నిత్యం వంటిట్లో కిందామీదా ప‌డే మ‌హిళ‌లు పెద్ద ఎత్తున చ‌నిపోతున్న దారుణ‌మిది. గ్యాస్ పొయ్యి కాకుండా క‌ట్టెల పొయ్యి వాడే కుటుంబాలు దేశంలో ల‌క్ష‌ల్లో ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందుతుంద‌ని నేత‌లు చెబుతున్నా.. నేటికి టాయిలెట్లు.. గ్యాస్ పొయ్యి లేని ఇళ్లు ఈ దేశంలో లక్ష‌లాదిగా ఉన్నాయి.

క‌ట్టెల పొయ్యి వాడే వంటింట్లో భారీ ఎత్తున ఉండే వాయుకాలుష్యం కార‌ణంగా మ‌హిళ‌లు పెద్ద ఎత్తున మృతి చెందుతున్నారు. వాయుకాలుష్యం మ‌హిళ‌ల ఉసురు తీస్తోంది. కేవ‌లం ఇంటి కాలుష్యం కార‌ణంగా 2015 ఒక్క ఏడాదాలో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల ప్రాణాలు పోయిన‌ట్లుగా చెప్పిన ఒక అంచ‌నా వింటే షాక్ తినాల్సిందే.

మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లాన్సెంట్ తొలిసారిగా కాలుష్య కార‌ణంగా చోటు చేసుకుంటున్న మ‌ర‌ణాల మీద ఒక జాబితాను త‌యారు చేసింది. ఇందులో 2015 ఒక్క ఏడాదిలో దేశంలో చోటు చేసుకున్న కాలుష్య మ‌ర‌ణాల్లో 5 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు కేవ‌లం వంటిట్లో విడుద‌ల అవుతున్న కాలుష్యాల కార‌ణం కావ‌టం గ‌మ‌నార్హం.

క‌ట్టెలు.. బొగ్గు లాంటి ఘ‌న ప‌దార్థాల్ని మండించ‌టం కార‌ణంగా వెంట్రుక ప‌రిమాణం కంటే మూడు రెట్లు చిన్న‌విగా ఉండే కాలుష్య కార‌కాలు నేరుగా ఊపిరితిత్తులు.. ర‌క్త‌క‌ణాల్లో క‌లిసి పోతున్నాయ‌ని.. ఈ కార‌ణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన మ‌హిళ‌లు మ‌ర‌ణిస్తున్నార‌ని స‌ద‌రు రిపోర్ట్ బ‌య‌ట‌పెట్టింది. ఇదిలా ఉంటే.. ప్ర‌ధాని మోడీ పిలుపుతో స్పందించిన ల‌క్ష‌లాది మంది వినియోగ‌దారులు త‌మ గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకున్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు ఇంత భారీగా స్పందించిన‌ప్పుడు ప్ర‌భుత్వాలు త‌మ స్థాయిలో స్పందిస్తే.. ఈ దారుణ మ‌ర‌ణాల‌కు చెక్ చెప్పొచ్చు.  ఇలాంటి రిపోర్ట్ ల‌పై మోడీ రియాక్ట్ అయితే బాగుంటుంది.
Tags:    

Similar News