అప్పుడూ ‘‘ఉల్లి’’ బాంబులా దెబ్బేసింది మోడీ సాబ్

Update: 2015-07-25 05:29 GMT
ఎన్డీయే సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చి.. ప్రధానిగా ఐదేళ్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్డీయే సర్కారుకు షాక్ తగిలేలా ఓటర్లు తీర్పు ఇవ్వటం తెలిసిందే. ప్రధానిగా వాజ్ పేయ్ ను ఎవరూ విమర్శించకున్నా.. ఎన్డీయే హయాంలో పెరిగిన ఉల్లి మంట అప్పటి ఎన్నికల్లో ఎన్డీయేకు షాకిచ్చేలా చేసింది.

తాజాగా మరోసారి ఉల్లిమంట మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు భగ్గుమంటున్నాయి. మొన్నటివరకూ ఒక మోస్తరుగా ఉన్న ఉల్లిపాయ ధరలు నెల రోజుల వ్యవధిలో భారీగా పెరగటం తెలిసిందే. మొన్నటివరకూ కిలో ఉల్లిపాయలు రూ.20 నుంచి రూ.23 మధ్యలో ఉంటే.. కేవలం నెల రోజుల వ్యవధిలో.. కిలో ఉల్లి ధర రూ.35 నుంచి రూ.40 వరకు చేరుకోవటం గమనార్హం.

దేశంలోని ఉల్లిపాయ అవసరాల్ని తీర్చే మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లి దిగుబడులు తగ్గటం.. వర్షాభావం వల్ల పంట మీద ప్రభావం చూపించటంతో ఉల్లి ధరలు అంతకంతకూ పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నికలు రానున్న వేళ.. ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరగటం మోడీ సర్కారుకు అంత మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. వాజ్ పేయ్ హయాంలోనూ ఉల్లి ధరలకు కళ్లాలు వేయటంలో నిర్లక్ష్యం చూపించిన దానికి ఫలితం అనుభవించిన వైనాన్ని మర్చిపోకుండా.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఉల్లిపాయ బాంబుగా మారి.. మోడీ సర్కారును ముంచేయటం ఖాయం.
Tags:    

Similar News