'ఉల్లి' ధర బాంబు.. ఎంత పనిచేసింది.?

Update: 2019-09-24 09:22 GMT
కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ.. ఇప్పుడు పెరిగిన ఉల్లి ధరలు చూసి కాదేది దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు.. పెరిగిన ధరలతో దొంగల కన్ను ఇప్పుడు ఉల్లిపంటపై పడింది. చాకచక్యంగా ఉల్లి పంటను ఎత్తుకెళ్లుపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధర పెరగడం.. డిమాండ్ ఎక్కువ కావడంతో ఇప్పుడు ‘ఉల్లిదొంగలు ’ పుట్టుకొచ్చారు.

ఉల్లి ధర కొండెక్కింది. ఖరీదైన యాపిల్ పండుకంటే కూడా ధర ప్రియమైంది. మన హైదరాబాద్ లో కిలో ఉల్లిధర రూ.50 దాటింది. ఢిల్లీ - ఉత్తరాది మార్కెట్లో  రూ.80 కిలో పలుకుతోంది. సూపర్ మార్కెట్లలో అయితే 100 కు చేరవైంది. నిత్యావసరాల్లో అతిముఖ్యమైన ఉల్లి లేకుండా వంటలు వండేపరిస్థితి లేదు. అందుకే అందరూ కిలోతోనే సరిపెడుతున్నారు. అయినా కొరతతో ఇప్పుడు ఉల్లి కోసం ఉత్తరాదిన అంతా ఆరాటపడుతున్నారు.

ఉల్లిధరలు పెరగడంతో దొంగల కన్ను ఇప్పుడు ఉల్లిపై పడింది. తాజాగా బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో దాదాపు 8 లక్షల విలువ చేసే గోడౌన్ లోని ఉల్లిని దొంగలు చోరీ చేశారు. గౌడన్ లో ఉల్లి దొంగతనం అయిందని తెలుసుకొని వ్యాపారి ధీరజ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. ఉల్లిని కూడా దొంగతనం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదని.. 328 బ్యాగుల ఉల్లిని ఎత్తుకెళ్లారని వాపోయాడు. ఇంతటి కరువును ఎప్పుడూ చూడలేదన్నాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పెద్ద వ్యాన్ లో వచ్చి ఉల్లి బస్తాలను దొంగతనం చేసి తీసుకెళ్లారని గుర్తించారు.

ఉల్లి ధర పెరగడం.. దొంగలు ఉల్లి గౌడన్లపై పడడంతో బీహార్ లో ఉల్లి వ్యాపారులంతా  తమ గౌడన్ల వద్ద నిఘా పెట్టారట..
Tags:    

Similar News