టైమ్స్ టాప్ వందలో మనోడు ఒక్కడే.. అతడెవరంటే?

Update: 2022-09-29 04:40 GMT
ప్రపంచ కుబేరుల జాబితా మొదలు.. లిస్టు ఏదైనా సరే మనోళ్లు పెద్ద ఎత్తున ఉంటున్న పరిస్థితి. అలాంటిది.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ విడుదల చేసిన ఒక జాబితాలో ప్రపంచం మొత్తంలో టాప్ 100లో మనోడు ఒకే ఒక్కడు నిలవటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ ఘనతను సొంతం చేసుకున్నది మరెవరో కాదు.. రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ టైమ్స్ మ్యాగజీన్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వంద మంది వర్థమాన నాయకులతో ఒక జాబితాను రూపొందించారు. దీనికి "టైమ్ 100 నెక్ట్స్" అన్న పేరును పెట్టారు. ఆ జాబితాలో ఎంపికైన వంద మందిలో భారత్ నుంచి ఎంపికైన ఒకే ఒక్కడు ఆకాశ్ అంబానీ.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పెద్ద కొడుకైన ఆకాశ్ అంబానీ జియో ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన మార్కును చూపించటంలో సక్సెస్ అయ్యారు. 22 ఏళ్ల చిన్న వయసులోనే కంపెనీ బోర్డులో చేరి.. ఇప్పుడు పూర్తి స్థాయిలో సంస్థను నిర్వహిస్తున్నారు. 5జీ రేసులోనూ ప్రత్యర్థులకు ధీటుగా ప్లానింగ్ చేస్తున్న ఆకాశ్.. వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లోనూ తన మార్కును చూపిస్తున్నట్లు చెబుతున్నారు.

రిలయన్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు గూగుల్.. ఫేస్ బుక్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వేలాది కోట్ల రూపాయిల పెట్టుబడుల్ని ఆకర్షించటంలో కీలక పాత్ర పోషించారు. కరోనా లాంటి ప్రపంచ సంక్షోభ సమయంలోనూ సంస్థ పని తీరు మెరుపులు మెరిపించేలా చేయటంలో ఆకాశ్ పాత్ర చాలా కీలకమని చెబుతారు.

వ్యాపారం.. వినోదం.. క్రీడలు.. రాజకీయాలు.. ఆరోగ్యం.. సైన్స్.. సమాజసేవ రంగాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంద మంది వర్ధమాన నాయకుల జాబితాను తయారు చేయగా.. భారత్ నుంచి ఎంపికైన ఏకైక యువ తేజం ఆకాశ్ అంబానీ. ఇదే జాబితాలో భారత సంతతికి చెందిన అమెరికన్ ఓన్లీ ఫ్యాన్స్ అధిపతి ఆమ్రపాలి గన్ కూడా ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News