షర్మిల పార్టీలోకి చేరాలనుకునే వారికి ఓపెన్ ఆఫర్

Update: 2021-02-15 12:30 GMT
''మీరు ప్రజల మధ్య నిత్యం తిరుగుతుంటారు. నా కంటే మీకు ప్రజలు పడుతున్న కష్టాలు బాగా తెలుసు. రాజన్న రాజ్యం తేవాలన్నదే లక్ష్యం. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. మీరు చెబితే నేను వింటా. నేను వచ్చింది మీరు చెప్పేది వినేందుకే'' అంటూ తాను పిలిచినంతనే వచ్చిన పలువురు నేతలు.. శ్రేయోభిలాషులను ఉద్దేశించి ప్రసంగించిన రాజన్న కుమార్తె షర్మిల.. తాజాగా మరోసారి హైదరాబాద్ కు వచ్చారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి లోటస్ పాండ్ కు చేరుకున్న ఆమె.. ఈ రోజు (సోమవారం) పలువురితో భేటీ అయ్యారు. హైదరాబాద్ తో పాటు.. రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలు.. శ్రేయోభిలాషులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.

షర్మిల పెట్టే కొత్త పార్టీలోకి అందరిని ఆహ్వానిస్తున్నమని.. ఏ పార్టీ నుంచి వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ పార్టీ పెట్టి నడిపిన దాఖలాలు లేవన్నారు. తొలిసారి దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల ప్రజల్లోకి వస్తున్నారని.. ముఖ్యంగా మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టొచ్చొన్నారు.

ఏప్రిల్ పది వరకు ఆత్మీయ సమ్మేళనాలు ఉంటాయని.. ఆ తర్వాత అన్ని జిల్లాల నాయకులతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన పద్దతిలో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. తమను విమర్శిస్తున్న వారికి తాము వేసే అడుగులే సమాధానాలన్న ఆయన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఆయన ఆహ్వానానికి ఎంతమంది నేతలు స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News