యాగానికి ప్రతిపక్షాలు దూరమే

Update: 2015-12-26 11:32 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపెట్టిన అయుత చండీ యాగానికి తెలంగాణలోని ప్రజలు తరలి వస్తున్నారు. మీడియా అధినేతలు వెళ్లి గంటల తరబడి కూర్చుంటున్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఆ ఛాయలకు కూడా వెళ్లడం లేదు. ఇటు కాంగ్రెస్.. అటు టీడీపీ.. మధ్యలో బీజేపీ - సీపీఐ - సీపీఎం నేతలు ఎవరూ కూడా ఆ ఛాయలకు వెళ్లడం లేదు. తొలిరోజు ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ ఎంతో శ్రద్ధగా యాగశాలలో కనిపించినా ఆ తర్వాత నుంచి ఆయన మాయమయ్యారు. ఇక కాంగ్రెస్ - టీడీపీ నేతలు ఒక్కరు కూడా యాగశాల ఛాయలకు కూడా రావడం లేదు.

నిజానికి ఇది కేసీఆర్ వ్యక్తిగతంగా చేపడుతున్న యాగం. ఆయన వ్యక్తిగతంగానే అందరినీ పిలిచారు కూడా. అందుకే వ్యక్తిగతంగా ఆయనతో సంబంధాలు ఉన్నవాళ్లు.. ముఖ్యమంత్రిగా ఆయనతో భవిష్యత్తులో పని ఉన్నవాల్లు మాత్రమే యాగానికి వెళుతున్నారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినందుకు వెళ్లి.. కొంతసేపటికే తిరిగి వచ్చేస్తున్నారు. అలా మర్యాదపూర్వకంగా కూడా కాంగ్రెస్, టీడీపీ నేతలు యాగానికి వెళ్లడం లేదు.

కేసీఆర్ వ్యక్తిగతంగా చేపట్టిన ఈ యాగంలో మంత్రులు తరిస్తున్నారు. ఎమ్మెల్యేలు తరిస్తున్నారు. వారు తరించినా పెద్ద పట్టింపు ఉండదు. కానీ, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు దీక్షా వస్త్రాలు ధరించి మరీ తరిస్తున్నారు. తొలి రోజు అయితే మొత్తం అసెంబ్లీ - సచివాలయం - ప్రభుత్వమంతా కలిసి ఎర్రవల్లిలోనే ఉండిపోయింది. గత మూడు రోజులుగా ఇంచు మించు ఇదే పరిస్థితి. భక్తితో అక్కడికి వెళ్లడం వేరు. అక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడం వేరు.

ఈ నేపథ్యంలోనే యాగం ముగిసిన తర్వాత విమర్శనాస్త్రాలు సంధించడానికి ప్రతిపక్షాలు కాచుకుని కూర్చున్నాయి. ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు తమనే తప్పుపట్టే అవకాశం ఉందని కాస్త వేచి చూస్తున్నాయి. యాగం తర్వాత విమర్శలు చేయడానికి వీలుగానే ఇప్పుడు యాగానికి కూడా వెళ్లడం లేదని చెబుతున్నారు.
Tags:    

Similar News