లోక్ సభలో మంత్రికి వెరైటీగా షాకిచ్చిన విపక్షం

Update: 2016-11-22 04:05 GMT
చట్టసభల్లో అధికార పక్షాలను ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తరచూ ప్రయత్నిస్తుంటాయి. మర్యాదపూర్వకంగా నిరసనలు తెలపటం.. ప్రభుత్వ నిర్ణయాలపై తమ ఆవేదనను చర్చల ద్వారా తెలియజెప్పటమే కాదు.. తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోసేలా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ.. దూకుడు రాజకీయాల్లో మాటల కంటే చేతలకే ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్న వైనం కనిపిస్తోంది. లోక్ సభలోనే కాదు.. పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్షాలు మాటల కంటే చేతలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి.

 ప్రభుత్వ నిర్ణయాల్నివ్యతిరేకించే అంశంపై స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయటం.. స్పీకర్ చుట్టూ పార్టీ నేతలు చేరటం.. ప్లకార్డులు పట్టుకోవటం.. నినాదాలు చేయటం.. లాంటి పనులెన్నో చేయటం తెలిసిందే. సభ జరగకుండా చేయటం ద్వారా తమ ఆందోళనల్ని.. నిరసనల్ని బయట ప్రపంచానికి తెలియజేయాలన్న లక్ష్యంతో విపక్షాలు తరచూ ప్రయత్నిస్తుంటాయి. అయితే.. విపక్షాలు తరచూ చేపట్టే కార్యక్రమాలకు భిన్నంగా సోమవారం చిత్రమైన పరిణామం ఒకటి లోక్ సభలో చోటు చేసుకుంది.

మోడీ సర్కారు తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని లోక్ సభలోని పది విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గడిచిన కొద్దిరోజులుగా పార్లమెంటు సమావేశాల్ని అడ్డుకుంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. మోడీ తీసుకున్న రద్దునిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మానవ వనరుల శాఖామంత్రి ప్రకాశ్ జవ్ డేకర్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన ముఖం టీవీలో కనిపించకుండా ఉండేలా.. ఆయన ముఖం ముందు విపక్ష నేతలు కొందరు ప్లకార్డులు ఉంచేశారు.

ఈ చర్యపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని కూడా కావాలంటే టీవీలో చూపించమని లోక్ సభ టీవీ వాళ్లకు చెబుతాను. టీవీలో పడి ప్రజలకు కనిపించేందుకు మంత్రుల సీట్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చురకలు వేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. తాము టీవీ లో కనిపించేందుకు రాలేదని.. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంతకాలం స్పీకర్ కేంద్రంగా నిరసనలు చేసే వైనానికి భిన్నంగా సభలో ఉన్న మంత్రుల్ని టార్గెట్ చేసిన సరికొత్త సంప్రదాయం రానున్న రోజుల్లో మరెన్ని సమస్యల్ని తెర పైకి తీసుకొస్తుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News