మిత్రపక్షాలు రెండోస్ధానానికి వస్తే అదే గొప్ప

Update: 2020-12-28 03:30 GMT
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నోటిఫికేష్ ఎప్పుడుస్తుందో ప్రస్తుతానికైతే ఎవరికీ తెలీదు. అయితే తమదే గెలుపంటూ బీజేపీ తెగ గోల చేసేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాల్సింది తామే అంటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీలో తెగ లాబీయింగ్ చేసేస్తున్నారు. సరే మిత్రపక్షాల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పటికప్పుడు తేలకపోయినా గెలుపు విషయంలో మాత్రం బీజేపీ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గల్లో తమకున్న బలమెంతో  బీజేపీ - జనసేన పార్టీలకు చాలా బాగా తెలుసు. మొన్నటి ఎన్నికల్లో 2.28 లక్షల ఓట్ల మెజారిటితో వైసీపీ సమీప అభ్యర్ధి టీడీపీపై గెలిచిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా వైసీపీ దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణించటంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

అప్పట్లో అఖండ మెజారిటితో మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వైసీపీ పోటీ విషయంలో కానీ గెలుపు విషయంలో కానీ ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. అలాగే రెండోస్ధానంలో నిలిచిన తెలుగుదేశంపార్టీ కూడా గెలుపు విషయంలో బహిరంగంగా ఏమీ ప్రకటన చేయలేదు. ఏదో జూమ్ యాప్ కాన్ఫరెన్సులో మాత్రం చంద్రబాబునాయుడు గెలుపుపై రెచ్చిపోతున్నారు. బహుశా జనవరి 6వ తేదీ తర్వాత అభ్యర్ధి పనబాక లక్ష్మి ప్రచారానికి తెరలేపవచ్చని అందరు అనుకుంటున్నారు.

జనవరి 6వ తేదీ డెడ్ లైన్ ఏమిటంటే ఆరోజు ఆమె కూతురు వివాహం జరగబోతోంది. వివాహం అయిపోతే ఇక ఫ్రీ అయిపోతారు కాబట్టి ఎన్నికల బరిలోకి దిగుతారని అనుకుంటున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 16500. జనసేన అయితే అసలు పోటీయే చేయలేదు. వాస్తవ పరిస్ధితి ఇలాగుంటే రెండుపార్టీల నేతల మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి.

అయితే క్షేత్రస్ధాయిలోని విషయాలు గమనిస్తుంటే మిత్రపక్షాల ఎంత గట్టిగా పోరాడినా మూడోస్ధానం దాటే అవకాశం మాత్రం లేదనే అంటున్నారు. ఎంత గట్టిగా పోరాటం చేసినా మిత్రపక్షాల అభ్యర్ధి మహా అయితే రెండోస్ధానం దాకా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సీటులో గనుక గెలుపు కోసం టీడీపీ చిత్తశుద్దితో పోరాటం చేస్తే మిత్రపక్షాలకు మూడోస్ధానం దక్కుతుందట. ఒకవేళ టీడీపీ గనుక జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనే ప్లానుతో గతంలో కడప పార్లమెంటులో ఓట్లను త్యాగం చేసినట్లు చేసి తమ ఓట్లను మిత్రపక్షాల అభ్యర్ధికి వేయిస్తే అప్పుడు పరిస్ధితుల్లో మాత్రం వస్తుందంటున్నారు.
Tags:    

Similar News